Political Strategists : నిజంగా వ్యూహకర్తలు గెలిపించగలరా?

పీకేను నియమించుకున్న వైసీపీని చూసి అవహేళన చేసింది. ఓటమి ఎదురయ్యేసరికి తత్వం బోధపడింది. తమకు అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నారని కూడా వారు చెప్పుకున్నారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి రాబిన్ శర్మను టీడీపీ తెచ్చి పెట్టుకుంది.

Written By: Dharma, Updated On : June 1, 2023 9:08 am
Follow us on

Political Strategists : 2014 తరువాత  రాజకీయ వ్యూహకర్తల శకం ప్రారంభమైంది. వీరికి ఆధ్యుడు మాత్ర పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. గుజరాత్ సీఎం నుంచి ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్ చేయబడిన నరేంద్రమోదీకి పనిచేసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. అప్పటికే మోదీ పేరు మార్మోగుతోంది. దేశాన్ని బాగుచేయడానికి వచ్చిన ఒక దైవదూతగా అంతా భావించారు. దీనికితోడు 2004నుంచి ఎదురైన ఓటమితో బీజేపీ శ్రేణులు కసిగా ఉన్నాయి. కష్టపడి పనిచేయడంతో ఎన్టీఏకు సునాయాస విజయం దక్కింది. అయితే ప్రధాని మోదీతో పాటు వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరు సైతం మార్మోగిపోయింది.

2019 ఎన్నికలకు ముందు వైసీపీకి ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా నియమితులయ్యారు. అప్పటికే టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకత పెల్లుబికింది. పాదయాత్రతో జగన్ సమ్మోహన శక్తిగా మారిపోయారు. ప్రజామోదం దక్కించుకున్నారు. ఎన్నికల్లో అద్భుత విజయం దక్కించుకున్నారు. దీంతో జగన్ తో పాటు పీకేకు ఆ విజయాన్ని కట్టబెట్టారు.  ఇక్కడ ఒకటి పరిగణలోకి తీసుకోవాలి. కేవలం అనుకూల ప్రభావం ఉన్నపార్టీలకు వ్యూహకర్తలు ఊతం ఇవ్వొచ్చు. కానీ నేరుగా విజయాన్ని కట్టబెట్టలేరన్న సూత్రం గుర్తెరగాలి. వైసీపీని మరోమారు గెలిపించడానికి జగన్ పీకే టీమ్ తో ఒప్పందం చేసుకున్నారు. 2019 పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్లాన్స్ కూడా పెద్దగా వర్కవుట్ కావడం లేదు.

తమకు అసలు వ్యూహకర్తే అవసరం లేదని తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చింది. పీకేను నియమించుకున్న వైసీపీని చూసి అవహేళన చేసింది. ఓటమి ఎదురయ్యేసరికి తత్వం బోధపడింది. తమకు అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నారని కూడా వారు చెప్పుకున్నారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి రాబిన్ శర్మను టీడీపీ తెచ్చి పెట్టుకుంది. రాబిన్ శర్మ సూచనలతోనే ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అన్న ప్రోగ్రాం తీసుకున్నారు.  అలాగే బాదుడే బాదుడు అని మరో కార్యక్రమం కూడా చేపట్టారు. ఇవన్నీ క్యాడర్ ని ఎంతో కొంత కదిలించడానికి ఉపయోపడ్డాయి. కానీ రాబిన్ శర్మే అన్నీ చేశారు అనడం సరికాదు. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి కూడా ఒక కారణం ఉంది. అదే పార్టీ శ్రేణులో కసి పెరగడం, జోష్ తో పనిచేయడం.

అటు పీకే అయినా.. ఇటు రాబిన్ శర్మ అయినా వ్యూహాలు రూపొందించగలరు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం, పోలింగ్ బూత్ లకు రప్పించడం, అనుకూల ఓటంగ్ అంతా ఆయా పార్టీ శ్రేణుల చేతుల్లో ఉంటుంది. స్ట్రాటజిస్టులను నియమించాం కదా అంటే గెలుపు తనంతట తాను రాదు అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. కాకలు తీరిన స్ట్రాటజిస్టులు అయినా..అనుకూల ఓటింగ్ రావాలంటే దానికి పార్టీ శ్రేణులు కీలకం. కానీ రాజకీయ పార్టీలు ఆ సూత్రాన్నిమరిచి ముందుకెళుతున్నాయి. మూల్యం చెల్లించుకుంటున్నాయి.