Vemireddy Prabhakar Reddy: వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి రాయలసీమతో సమానంగా బలాన్ని అందిస్తూ వస్తోంది ఈ జిల్లా. గత ఎన్నికల్లో రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో వైసీపీకి వచ్చిన సీట్లు 59. టిడిపికి కేవలం మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి. కోస్తాంధ్రతో పాటు ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీకి ఏకంగా 116 సీట్లు వచ్చాయి. అంటే రాయలసీమలో ఆ పార్టీది ఏకపక్ష విజయం. అయితే ఈసారి అక్కడ ఆ చాన్స్ లేదని తెలుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ప్రతికూల ప్రభావం అధికంగా ఉంది. దానికి ప్రధాన కారణం వేంరెడ్డి దంపతులు. ప్రస్తుతం వారిద్దరూ టిడిపి తరఫున పోటీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కలవరపాటుకు గురి చేసే అంశం.
వైసీపీ రాయలసీమపై ఆశలు పెట్టుకుంది. కానీ అక్కడ వివేకానంద రెడ్డి హత్య, షర్మిల యాక్టివ్ కావడం, విపక్షాలు కూటమి కట్టడం తదితర కారణాలతో మునుపటి ఫలితాలు వచ్చే ఛాన్స్ లేదు. పోనీ నెల్లూరులో గట్టెక్కుదాం అని భావిస్తే.. అక్కడ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. బలమైన నేత వేంరెడ్డి ఎదురు తిరిగారు. దీంతో వేం రెడ్డికి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డిని బరిలో దించాల్సి వచ్చింది. అయినా సరే అక్కడ పరిస్థితి మెరుగు పడడం లేదు. ముఖ్యంగా వైసిపి శ్రేణులే వేంరెడ్డిని అనుసరిస్తున్నాయి. రోజురోజుకు నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దిగజారుతోంది.
ఎలాగైనా వేంరెడ్డిని తమ రూట్లోకి తెచ్చుకోవాలని వైసిపి భావించింది. కానీ ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. ఆయన కంటే భార్య ప్రశాంతి రెడ్డి టిడిపి తరఫున గట్టిగా వర్క్ చేస్తున్నారు. దీంతో వైసిపి ఒక రకమైన ప్రచారానికి పూనుకుంది. నామినేషన్ల పర్వం నాటికి వేంరెడ్డి దంపతులు తిరిగి వైసీపీలోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో హుటాహుటిన వేంరెడ్డి దంపతులు ప్రెస్ ముందుకు వచ్చారు. తమపై కావాలనే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు టిడిపి రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా వేమిరెడ్డి తిరస్కరించారు. స్వచ్ఛందంగా వైసీపీలో చేరారు. ఇప్పుడు అదే వేంరెడ్డి టిడిపిలోకి వెళ్లి తిరిగి వైసీపీలోకి వస్తారన్న ప్రచారాన్ని ప్రజలు పెద్దగా నమ్మడం లేదు. దీంతో వైసిపి ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. అయితే ఈ తరహా ప్రచారంతో నెల్లూరులో వైసిపి వీక్ అయ్యిందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. వైసీపీ చేసిన ప్రయత్నాలను వేంరెడ్డి దంపతులు ఆదిలోనే తుంచేశారని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరు ఇప్పుడు వైసీపీకి కలవర పెడుతోంది. ఇక్కడ ఫలితాలు తారుమారైతే వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పవన్న విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.