Byreddy Siddharth Reddy: రాజకీయంగా ఒంటరి.. రెండింటికీ చెడ్డ రేవడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి!

వైసీపీలో సోషల్ మీడియా నేతలుగా చాలామంది ఉన్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం తో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, గుడ్ మార్నింగ్ రాజమండ్రి తో మార్గాని భరత్ తెగ హడావిడి చేశారు. మరో యంగ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అయితే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఒంటరి కావడం విశేషం.

Written By: Dharma, Updated On : August 10, 2024 7:01 pm

Byreddy siddardhareddy

Follow us on

Byreddy siddardhareddy :వైసిపి హయాంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హంగామా అంతా అంతా కాదు. మంచి మాస్ ఇమేజ్ తో యువతరానికి ఆదర్శం అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉండేది. చుట్టూ మంది మార్బలంతో సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసేవారు. నిత్యం యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ నిత్యం ప్రచారంలో ఉండేవారు. యువనేత అంటే ఇలా ఉండాలి అనేటట్టు ప్రచారం కల్పించుకునేవారు. వైసీపీలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే అదంతా గాలి బుడగే అన్నట్టు ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరిస్థితి మారింది. ఇప్పుడు ఆయనను పట్టించుకునే వారు కరువయ్యారు. వెంట నడిచేందుకు సైతం అనుచరులు ఇష్టపడడం లేదు. రాష్ట్రంలో వైసిపి ఓడిపోవడంతో ఒక్కొక్కరు సిద్ధార్థ రెడ్డిని వదిలేసి ఇతర పార్టీలో చేరుతున్నారు. చివరకు ఒంటరిగా మిగిలిపోయారు సిద్ధార్థ రెడ్డి. ఆయన పరిస్థితి చూసి అంతా జాలి పడుతున్నారు. సోషల్ మీడియాలో సైతం సెటైర్లు పడుతున్నాయి. వాస్తవానికి నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అక్కడ పోటీ చేసే ఛాన్స్ సిద్ధార్థ రెడ్డికి దక్కలేదు. గత రెండుసార్లు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలిచేసరికి అది తన చలువే అన్నట్టు సిద్ధార్థ రెడ్డి వ్యవహరించేవారు. మొత్తం నియోజకవర్గంలో ఎమ్మెల్యేను డమ్మీ చేసి అంతా తానై వ్యవహరించేవారు. దానికి తోడు 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో శాప్ చైర్మన్ పదవి సిద్ధార్థ రెడ్డికి వరించింది. దీంతో రాష్ట్రస్థాయి నాయకుడిగా చలామణి అయ్యారు సిద్ధార్థ రెడ్డి. కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో, పవర్ చేజారిపోవడంతో చుట్టూ ఉండేందుకు కూడా ఎవరు ఇష్టపడడం లేదు.

* బలానికి మించి ప్రచారం
నందికొట్కూరులో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు సిద్ధార్థ రెడ్డి. అయితే ఆయన బలానికి మించి సోషల్ మీడియాలో ప్రచారం జరిగేది. ఓ రేంజ్ లో ఆయన గురించి ఎస్టాబ్లిష్ చేసేవారు. సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయ్యేది. మరోవైపు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రతినిధులను తన చెప్పు చేతల్లో ఉంచుకునేవారు సిద్ధార్థ రెడ్డి. వారంతా తనను చూసి, తన వెన్నంటి ఉండేవారని భావించారు. కానీ అధికారం దూరమయ్యేసరికి రెండు నెలల వ్యవధిలోనే ఒంటరిగా మిగిలారు సిద్ధార్థ రెడ్డి.

* టిడిపిలో చేరికలు
నందికొట్కూరు మున్సిపాలిటీ నుంచి అప్పుడే టిడిపిలో చేరికలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో నందికొట్కూరు లో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కింది. మొత్తం 29 కౌన్సిలర్లకు గాను.. 21 మంది వైసీపీ నుంచి గెలిచారు. ఏడుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించగా.. టిడిపి నుంచి మాత్రం ఒక్కరే గెలుపొందారు. దీంతో తన అనుచరుడు సుధాకర్ రెడ్డికి చైర్మన్ చేశారు సిద్ధార్థ రెడ్డి. ఇప్పుడు అదే సుధాకర్ రెడ్డి టిడిపిలో చేరుతున్నారు. తన వెంట మెజారిటీ కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్తున్నారు. దీంతో నందికొట్కూరు మున్సిపాలిటీ టిడిపి వశం అయ్యింది.

* చెల్లెలు ఎంపీగా
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కేవలం వైసీపీ ఇన్చార్జిగా కొనసాగారు. శాప్ చైర్మన్ గా మాత్రమే నామినేట్ అయ్యారు. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాబాయ్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి నంద్యాల ఎంపీగా గెలిచారు. ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. నంద్యాల టికెట్ దక్కించుకొని ఎంచక్కా పార్లమెంట్ సభ్యురాలు అయ్యారు. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయారు. ఎన్నికల్లో జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి తను సూచించిన నేతకు జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. తనకు సైతం ఇతర నియోజకవర్గాల్లో అవకాశం కల్పించలేదు. రెండిటికి చెడ్డ రేవడిగా మారిపోయారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.