వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. అటు యువగళం పేరిట నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారు. ఇప్పటికే రాయలసీమలో యాత్రను పూర్తిచేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. మరోవైపు చంద్రబాబు జిల్లాల యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు. మహానాడులో మినీ మేనిఫెస్టోను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దానిని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ పేరుతో బస్సు యాత్రలకు టీడీపీ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజించి బస్సు యాత్ర చేపడుతున్నారు.
ఈ రోజు బస్సుయాత్రల షెడ్యూల్ ను టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్రబాబు వెల్లడించారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. జోన్-1కి సంబంధించి విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలోని రాజాం నియోజకవర్గంలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. జోన్-2కి సంబంధించి కాకినాడ పార్లమెంట్ లోని కాకినాడ నగరంలో, జోన్-3 కి సంబంధించి విజయవాడ పార్లమెంట్ లోని తిరువూరు నియోజకవర్గం వినగడప గ్రామం నుంచి జోన్-4కి సంబంధించి చిత్తూరు పార్లమెంట్ లోని పలమనేరు నియోజకవర్గంలో, జోన్-5కి సంబంధించి కర్నూలు పార్లమెంట్ లోని మంత్రాలయం నియోజకవర్గం తారాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుందని నరేంద్రబాబు తెలిపారు. టీడీపీ శ్రేణులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు.
గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న బస్సు యాత్రలో టీడీపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఆ జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలో నాయకులు హాజరవుతున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు పూర్తయ్యాయి. మిగతా ప్రాంతాల్లో సైతం వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న తలంపులో టీడీపీ నాయకత్వం ఉంది.