Summer in AP : ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలతో సెగలు పుట్టిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత రికార్డైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం 35 మండలాల్లో వడగాడ్పులు వీచాయని పేర్కొంది.
కొద్దిరోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఆదివారం రాష్ట్రంలో 73 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. గుంటూరులో 15 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 11 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపింది. సోమవారం 12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలున్నాయి. అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పిడుగుపాటు, అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు మెడ వెనుక జుట్టు నిక్కబొడుచుకోవడం లేదా చర్మం జలదరింపు ఉంటే, అది మెరుపు లేదా పిడుగు రావడానికి సూచన అని తెలిపింది.