BRS And YSR Congress: సాధారణంగా రాజకీయ పార్టీలు వేర్వేరు మార్గాల్లో వెళ్తుంటాయి. సిద్ధాంతాలతో పాటు భావజాలం వేరువేరుగా ఉంటుంది. అంతిమంగా ప్రజలకు మేలు చేయడమే కానీ.. వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన విపక్షాలుగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీలు ఒకే సారూప్యతతో ముందుకు వెళ్లడం విశేషం. చాలా అంశాల్లో ఆ రెండు పార్టీలు ఒకే విధానంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకే రకమైన వ్యవహార శైలి.. ఒకే రకమైన భావజాలం రెండు పార్టీల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
* తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. ఆయన ప్రజల్లోకి వచ్చింది చాలా తక్కువ. అలాగని అసెంబ్లీకి వెళ్ళరు. టైగర్ కు టైం వచ్చింది అంటూ పార్టీ శ్రేణులు గర్వంగా చెబుతుంటాయి. కానీ ఆయన ప్రజల్లోకి వచ్చింది లేదు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి తీరు సైతం అలానే ఉంటుంది. ఆయన ప్యాలెస్ ల చుట్టూ తిరుగుతుంటారు. వారంలో నాలుగు రోజులపాటు బెంగళూరు ఎలాహంక ప్యాలెస్ లో ఉంటారు. మూడు రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో గడుపుతారు. ఇప్పుడు హైదరాబాద్ ప్యాలెస్ కి వెళ్తానంటున్నారు. ఈయన సైతం అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ప్రజల మధ్యకు వచ్చే సాహసం చేయడం లేదు. అయినా సరే వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఈ ఇద్దరు నేతలు చెబుతున్నారు.
* ఎన్డీఏ ప్రభుత్వం విషయంలో సైతం వీరు సానుకూలంగానే ఉంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయితే కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడేవారు. వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కేంద్రానికి చిన్న విమర్శ కూడా చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి తీరు గురించి చెప్పనవసరం లేదు. విమర్శలు చేయలేదు సరి కదా.. తిరిగి వ్యతిరేక కూటమికి మద్దతు తెలుపుతున్నారు. అప్పట్లో ప్రత్యేక హోదా విషయంలో చిన్నపాటి విమర్శలు కూడా చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు.
* రెండు పార్టీలకు ఆడపడుచుల బెడద తప్పడం లేదు. ఏపీలో సోదరుడు జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నారు షర్మిల. రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. తెలంగాణలో సోదరుడు కేటీఆర్ తో పాటు తండ్రిని వ్యతిరేకిస్తున్నారు కవిత. ఘాటైన విమర్శలు చేస్తూ సొంత పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారు కవిత. అయితే ఈ ఇద్దరు ఆడబిడ్డలకు సోదరుల కాలకేయ సోషల్ మీడియా సైన్యం చుక్కలు చూపిస్తోంది.
* మరోవైపు ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేటీఆర్ పాదయాత్రలకు సిద్ధపడుతున్నారు. వారికి పోటీగా చెల్లెలు సైతం పాదయాత్ర దిశగా ఆలోచనలు చేస్తున్నారట.
* మరోవైపు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎలివేషన్లు మామూలుగా ఉండవు. చిన్నపిల్లల సీన్ క్రియేట్ చేస్తారు. జగన్ మామయ్య అంటూ గుక్క తిప్పి ఏడుస్తారు. అయితే ఈ ఎలివేషన్లు వెనుక ఐప్యాక్ హస్తం ఉంటుంది. అటువంటిదే ఇటీవల తెలంగాణలో కెసిఆర్ కూడా చేసి చూపించారు. జగిత్యాల సభకు వెళ్తున్న క్రమంలో ఓ తండ్రి చెంతనే ఉన్న పిల్లకు ప్లయింగ్ కిస్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. అదంతా ఎలివేషన్లలో భాగమేనని తెలుస్తోంది. ఇలా ఆ రెండు పార్టీల భావసారుప్యత ప్రతి దాంట్లోనూ కనిపిస్తోంది.