AP Elections 2024: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ల ఓట్ల లెక్కింపు ఆగనుందా? ఈ మేరకు న్యాయస్థానాల నుంచి ఆదేశాలు రానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు హింసాత్మక ఘటనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మాచర్ల, పల్నాడు, అనంతపురం, తాడిపత్రి, చంద్రగిరి ప్రాంతాల్లో విధ్వంసకర ఘటనలు జరిగాయి. పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొనసాగాయి. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సృష్టించిన విధ్వంసం అందరికీ తెలిసిందే. అటు చంద్రగిరిలో టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై హత్యాయత్నం జరిగింది. తాడిపత్రిలో పెద్దిరెడ్డి హవా నడిచింది. ఇప్పటికీ ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. పోలింగ్ నాడు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పై వివాదం ఏర్పడింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నకు సంబంధించి ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఒక మినహాయింపు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం, సీల్ సరిగా లేకున్నా.. ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోరింది. దీనికి ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించింది. ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అటువంటి ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నేరుగా ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతి పత్రం అందించింది. దేశవ్యాప్తంగా లేని నిబంధనలు ఇక్కడ తెరపైకి తేవడం ఏమిటని ప్రశ్నించింది. అయితే ప్రధాన అధికారి కొంత సమయం ఇవ్వడంతో.. వైసిపి న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది.
దాదాపు 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు.ఉద్యోగ ఉపాధ్యాయులు వైసిపి పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీరందరి ఓట్లు చెల్లుబాటు అయితే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. టిడిపి కూటమి వైపు ఉద్యోగ ఉపాధ్యాయుల మొగ్గు చూపినట్లు వైసిపికి అంచనా ఉంది. అందుకు తగ్గట్టు నివేదికలు కూడా అందాయని తెలుస్తోంది. అందుకే వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. కనీసం ఆర్వో సంతకం, సీల్ సరిగా లేవని కొన్ని ఓట్లుపై అభ్యంతరాలు తెలిపితే.. ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చని వైసిపి భావిస్తోంది. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం టిడిపి కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని అనుమానిస్తోంది. అందుకే న్యాయస్థానానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును అడ్డుకోవాలని వైసిపి భావిస్తున్నట్లు సమాచారం. అయితే న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.