Botsa Satyanarayana And Sharmila: ఏపీ ( Andhra Pradesh) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి ప్రయాణం చేస్తోంది. ఆ పార్టీని కూటమి టార్గెట్ చేస్తోంది. అయితే ప్రభుత్వం పై వైసీపీ గట్టి ఆందోళనలే చేస్తోంది. కానీ ప్రతిపక్షాల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో మద్దతు దక్కడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాలకు కనీసం ఛాన్స్ ఇవ్వలేదు జగన్. కాంగ్రెస్ పార్టీని చాలా తేలిగ్గా తీసుకునేవారు. బిజెపితో అంతర్గత స్నేహం కొనసాగించేవారు. కానీ అదే బిజెపి టిడిపి తో పాటు జనసేనతో పొత్తు పెట్టుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు సైతం జగన్మోహన్ రెడ్డి విషయంలో దూరంగా ఉన్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి విజయవాడలో ఒక కార్యక్రమం జరిగింది. వామపక్షాలతో పాటు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం ఉండడంతో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
* తొలిసారిగా ఇతర పక్షాలతో..
సాధారణంగా ఎలాంటి కార్యక్రమం చేసినా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీది ఒంటరి ప్రయాణమే. కానీ ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా మిగతా రాజకీయ పక్షాలతో కలిసేందుకు ముందుకు వచ్చింది. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల తో పాటు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా వచ్చారు. ముందుగా బొత్స సత్యనారాయణ రాగా.. తరువాత వైయస్ షర్మిల వచ్చారు. ఆమె రాగానే బొత్స పలకరించారు. అమ్మ బాగున్నావా? ఇలా వచ్చి కూర్చో మా అంటూ తన పక్కనే ఉన్న కుర్చీని చూపించారు. దీంతో కుర్చీలో కూర్చున్న షర్మిల బొత్స సత్యనారాయణ తో మాటామంతీ కలిపారు. చాలా విషయాలను మాట్లాడుకున్నారు. కార్యక్రమం చివరిలో వస్తాను అన్నా అంటూ బొత్సకు నమస్కరించి వెళ్లిపోయారు షర్మిల.
* నలిగిపోతున్న వైయస్సార్ సన్నిహిత నేతలు..
అయితే షర్మిల( Y S Sharmila ) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నిహిత నేతలు సైతం స్పందించింది చాలా తక్కువ. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. వైయస్ సన్నిహిత సీనియర్ నేతలంతా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ సమయంలో వైసీపీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేతలకు ఆహ్వానాలు అందాయి. ఒకరిద్దరూ రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా వెళ్లారు. అయితే అలా వెళ్లిన వారికి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి. అందుకే షర్మిల విషయంలో వైసీపీ సీనియర్లు ఎవరు నోరు మెదపరు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత బొత్స షర్మిలను కలవడం.. ఆమెతో ముచ్చట్లు పెట్టుకోవడం వంటివి చూసి.. జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో నన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం షర్మిల తో ఆయన వైరం ఆ స్థాయిలో ఉంది. చూడాలి ఏం జరుగుతుందో?