Botsa Satyanarayana: ‘బొత్స’లో ఉన్న ధీమా.. మిగతా మంత్రుల్లో ఏదీ?

నెల్లూరుకు చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదే తరహా ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కూటమికి సహకరించారని.. ఎన్నికల నిర్వహణలో వారికి సాయమందించారని ఆరోపణలు చేశారు.

Written By: Dharma, Updated On : May 28, 2024 1:57 pm

Botsa Satyanarayana

Follow us on

Botsa Satyanarayana: ఈ ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ వైసీపీ ధీమాతో ఉంది. సీనియర్ మంత్రి బొత్స లాంటి వారు అయితే విశాఖ నగరంలో జూన్ 9న జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించారు. అంతవరకు ఓకే కానీ. మిగతా మంత్రుల ప్రకటనలు చూస్తుంటే వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. సాధారణంగా విపక్షంలో ఉన్నవారు రీపోలింగ్ ను కోరుతారు. కానీ ఈసారి మాత్రం నేరుగా మంత్రులే రీ పోలింగ్ కు డిమాండ్ చేయడం గమనించాల్సిన విషయం. గత ఎన్నికల సమయంలో అప్పటి టిడిపి మంత్రులు ఇదే తరహా ప్రకటనలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందా? అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి.

నెల్లూరుకు చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదే తరహా ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కూటమికి సహకరించారని.. ఎన్నికల నిర్వహణలో వారికి సాయమందించారని ఆరోపణలు చేశారు.నెల్లూరులో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నికలకు ముందు ఇక్కడ వైసిపి కీలక నేతలంతా టిడిపి బాట పట్టారు. ఎన్నికల్లో టిడిపి నేతలు సమన్వయంతో పని చేశారు. ముఖ్యంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరడం, ఎంపీ అభ్యర్థి కావడంతో ఒక రకమైన క్లిష్ట పరిస్థితిని వైసీపీ ఎదుర్కొంది. ఇప్పుడు నేరుగా సిట్టింగ్ మంత్రి జిల్లా కలెక్టర్ పై ఆరోపణలు చేయడంతో ముందే చేతులెత్తేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరో మంత్రి అంబటి రాంబాబు అయితే ఏకంగా రీపోలింగ్కు డిమాండ్ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఇక్కడ సైతం మంత్రి అంబటి రాంబాబు ముందే చేతులెత్తేసారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. పూర్తి ఎలక్షన్ కమిషన్ టిడిపి కూటమికి సహకరించిందని ఆయన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే నిట్టూర్పు మాటలతో ఎలక్షన్ కమిషన్ తో పాటు యంత్రాంగంపై నిందలు వేశారు. మంత్రి రోజా లాంటి వారు అయితే పోలింగ్ నాడు మధ్యాహ్ననికే సొంత పార్టీ శ్రేణులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంత జరిగిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ఏపీలో అధికారంలోకి వచ్చేది తామేనని ధీమాతో ఉన్నారు. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని కూడా ప్రకటించారు. విజయనగరం జిల్లాలో తొమ్మిది తొమ్మిది స్థానాలు స్వీప్ చేస్తామని కూడా ధీమా కనబరిచారు. అయితే బొత్సలో ఉన్న ధీమా మిగతా మంత్రుల్లో కనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఇదే వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అనుమానానికి కారణం.