Botsa Dharmana: సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు కామన్. అయితే గతం మాదిరిగా సిద్ధాంతపరంగా పార్టీలో కొనసాగే వారు తక్కువ. కానీ ఒక పార్టీలో కొనసాగాలంటే ప్రత్యర్థి పార్టీ నేతపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయాలి. అటువంటి పరిస్థితి నేటి రాజకీయాల్లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు అదే నేతలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు మాజీ మంత్రులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో వారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పుడు జగన్మోహన్ రెడ్డి పై చాలా కామెంట్లు చేశారు. ఆయన పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ఆ విమర్శలను గుర్తు చేస్తూ టిడిపి కూటమి జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డికి మించి ఓ ఇద్దరు మాజీ మంత్రులు చాలా బాధపడుతున్నారు. వారే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు.
నిత్యం అనుచిత వ్యాఖ్యలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో జగన్మోహన్ రెడ్డి పై ధర్మాన తో పాటు బొత్స చాలా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైసీపీ ఏర్పాటు చేసుకున్నారు జగన్. ఆ సమయంలో చాలామంది నేతలు జగన్ వెంట అడుగులు వేశారు. కానీ బొత్స తో పాటు ధర్మాన కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. ఎందుకంటే అప్పటికే ధర్మాన కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. బొత్స సత్యనారాయణ అయితే పార్టీలో టాప్ 5 లో ఉండేవారు. పైగా ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉండేవారు. అయితే ఈ ఇద్దరు నేతలు జగన్మోహన్ రెడ్డి పై చెయ్యని వ్యాఖ్యలు అంటూ లేవు. ఆయన వ్యాపారాలపై మాట్లాడారు. నేర ప్రవృత్తి పై వ్యాఖ్యలు చేశారు. దాదాపు వైసీపీ ఆవిర్భావం నుంచి 2014 ఎన్నికల వరకు ఈ ఇద్దరు నేతలు చేయని వ్యాఖ్యలు అంటూ లేవు.
పాత క్లిప్పింగులను ప్రదర్శిస్తున్న టిడిపి..
జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టిడిపి రంగంలోకి దిగింది. మేం చెప్పే కంటే.. వైసీపీలో ఉన్న బొత్స, ధర్మానలు చెప్పినవి ఇవి అంటూ పాత మీడియా క్లిప్పింగులు తీసి మరి చూపిస్తున్నారు టిడిపి నేతలు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాత క్లిప్పింగులు తీసి వీరి విమర్శలను మీడియా ముందు ప్రదర్శించారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక లక్ష్యం ఉన్నట్టు కనిపిస్తోంది. జగన్ వైఖరి గురించి సొంత పార్టీ వారి అభిప్రాయం చెప్పించే ప్రయత్నం ఒకటి కాగా.. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జగన్ అనుమానపు చూపులు చూసేలా చేయాలన్నది ప్రణాళికగా కనిపిస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా ఇప్పుడు జగన్ కంటే ధర్మాన, బొత్స ఇరకాటంలో పడుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దీనిని వ్యక్తిగతంగా తీసుకుంటే మాత్రం తమ పొలిటికల్ లైఫ్ క్లోజ్ అవుతుందని భయపడిపోతున్నారు. అనుచరుల వద్ద ఇదే మాటలు చెప్పి వణికిపోతున్నారు.
