Bolla Brahmanaidu: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది గండిపేట భూముల వివాదం. ఏకంగా 1500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేయాలని స్కెచ్ వేసి అడ్డంగా బుక్కయ్యారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వినుకొండ ఎమ్మెల్యేగా వైసిపి హయాంలో ఐదేళ్ల పాటు కొనసాగారు. ఇప్పుడు ఏకంగా 12 ఎకరాల ప్రభుత్వ భూమిని.. అదే ప్రభుత్వ జీవోలను మార్చి కాజేయాలని చూశారు. భూమి ఆక్రమణ వరకు ఓకే… కానీ ప్రభుత్వ జీవోలను మార్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పట్లో ఉన్న రెండు ప్రభుత్వాల సహకారంతోనే ఆయన ఈ బరితెగింపునకు పాల్పడి ఉంటారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాతనే ఆయనలో ఈ కోణం బయటపడటం విశేషం.
* డైరీ రంగంలో దిగ్గజం.
బొల్లా బ్రహ్మనాయుడు అంటే డైరీ రంగంలో ది గ్రేట్ అన్నట్టు ఉండేది. శూన్యంలో ఉన్న తిరుమల డైరీ ని లాభాల బాట పట్టించిన ఘనత ఆయనది. ఆ డైరీలో తన వాటాలను విక్రయించి రెండు వేల కోట్ల రూపాయలు పొందారు. వందల కోట్ల వ్యాపారాలతో హాయిగా గడిచిపోతుంది ఆయన జీవితం. అటువంటిది హైదరాబాద్ శివారులలో గండిపేట వద్ద 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ జీవోలను మార్చి.. తన భూమి అన్నట్టు చూపి అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. అరెస్టు కాక తప్పదు కూడా.
* వైసీపీలో చేరిన తర్వాత..
ఒక మంచి పేరుతో పాటు పరపతిని సొంతం చేసుకున్నారు బ్రహ్మానాయుడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతనే ఆయనకు ఇటువంటి బుద్ధి పుట్టినట్టు ఉంది. ఎందుకంటే వ్యాపారంతో పాటు తన వ్యక్తిత్వాన్ని సైతం ఆయన కాపాడుకుంటూ వచ్చారు. కానీ అదే వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టి.. గౌరవాన్ని ఇబ్బందుల్లో పెట్టుకుని కబ్జాలు, ఆక్రమణలతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బొల్లా బ్రహ్మనాయుడు అంటే ఒక కబ్జాకోరుగా చూస్తున్నారు. ఐదేళ్లపాటు వినుకొండ వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈ భూ వివాదంతో ఐదేళ్ల ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో వినుకొండలో చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరింత మంది బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
