Visakhapatnam Fishermen: సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన చేపల్లో కొమ్ము కోణం ఒకటి.. సముద్రంలో అత్యంత వేగంగా ఈద గల జీవుల్లో ఇదొకటి.. గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ఇది ఈదుతాయి. వీటికి ముక్కు భాగంలో ఉండే పదునైన కొమ్ము అత్యంత ప్రమాదకరమైనది. సముద్రంలో వేటాడే సమయంలో తోటి జీవులను చంపేస్తుంది. శత్రువుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఈ కొమ్మును ఒక ఆయుధంగా వాడుతుంది. ఒక్కోసారి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లతోపాటు పడవలకు సైతం ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఏకంగా వాటిని ముక్కుతో పొడిచి రంధ్రాలు కూడా చేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాగర సామ్రాజ్యాన్ని శాసించే బ్లాక్ మార్నిన్ గా గుర్తింపు పొందింది. అయితే అటువంటి ప్రమాదకర చేపలు చిన్న బోట్లతో వేటకు వెళ్లిన విశాఖ మత్స్యకారులకు చిక్కడం విశేషం.
* చేపల వేట నిషేధం..
ప్రస్తుతం సముద్రంలో చేపల వేట నిషేధం. పెద్ద పెద్ద మేకనైజ్డ్ బోట్ల వినియోగం కూడా నిషేధం. కానీ సంప్రదాయ మత్స్యకారులకు మాత్రం చిన్నచిన్న తెరచాప పడవలపై తీరానికి కొద్ది దూరంలో వేట సాగించవచ్చు. ఇలా శుక్రవారం విశాఖ తీరంలో వేటకు వెళ్లారు మత్స్యకారులు. అనూహ్యంగా వారి వలకు బ్లాక్ మార్లిన్ చాపలు చిక్కడం విశేషం. ఇవి సాధారణంగా సముద్ర పై భాగంలో కాకుండా చాలా అగాధాల్లో జీవిస్తుంటాయి. వీటిని వేటాడాలంటే పెద్ద పెద్ద మేకనైజ్డ్ బోట్లతో కిలోమీటర్ల కొద్దీ సముద్రం లోపల కు వెళ్లాలి. కానీ ప్రస్తుతం వేట నిషేధం ఉండడంతో అంత దూరం వెళ్ళకూడదు. అయినా సరే విశాఖపట్నం మత్స్యకారుల వలకు ఈ భారీ చేపలు చిక్కాయి. వీటిని అతి కష్టం మీద విశాఖపట్నం చేపల రేవుకు తరలించారు. ఒక్కో దాని బరువు 120 కిలోల నుంచి 200 కిలోల వరకు ఉంటుంది. ఈ రెండు చేపలను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.
* భారీ గిరాకీ..
మరోవైపు ఈ భారీ చేపలను వేలం వేశారు. దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. వేలం పాటలో ఒక్కో చేప 30 వేల రూపాయల వరకు ధర పలికింది. వేట లేని సమయంలో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు ఈ భారీ చేపలు కొండంత ఆనందాన్ని ఇచ్చాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ చేపలు.. చిన్న తెరచాప పడవపై చిక్కడం మాత్రం అందర్నీ ఆకట్టుకుంది.

