దేశంలో నానాటికి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఎక్కడ వ్యాధి అంటుకుంటుందోనని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా దాని పరిధి మాత్రం వేగంగా చాపకింద నీరులా ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ వాసులను మరో వ్యాధి భయపెడుతోంది. బ్లాక్ ఫంగస్ గా పిలిచే ఈ రోగం విశాఖలో వెలుగు చూసింది. దీంతో ఏపీ వాసులు భయాందోళన చెందుతున్నారు. మూలిగే నక్కమీద తాటి పండు పడినట్లు ఈ బ్లాక్ ఫంగస్ ఏమిట్రా దేవుడా అని ఆకాశం వైపు చూస్తున్నారు. కరోనా రక్కసి ప్రభావం తగ్గక ముందే బ్లాక్ ఫంగస్ అంటూ మరో వ్యాధి పుట్టుకురావడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
కరోనా నుంచే..
బ్లాక్ ఫంగస్ అనేది కరోనా నయం కావడానికి వాడే మందుల పర్యవసానంగానే వస్తుందని వైద్యులు తేల్చారు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరోనాతోనే సతమతమవుతుంటే ఈ కొత్త వ్యాధి ఏమిటని దిగులు చెందుతున్నారు. విశాఖలో తొలి కేసుగా డాక్టర్లు చెప్పారు. విశాఖ వాసుల్లో భయం నెలకొంది. బ్లాక్ ఫంగస్ తో ఎలా వేగేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇప్పటికే ఆందోళన
కరోనా మహమ్మారి వైరస్ ఏపీని అతలాకుతలం చేస్తోంది. కేసుల నమోదులో దేశంలోనే రెండో రాష్ర్టంగా ఏపీ రికార్డులు నెలకొల్పింది. ఈ క్రమంలో బ్లాక్ ఫంగస్ పేరుతో మరో వ్యాధి వెలుగు చూడడం ఏపీ వాసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనాతోనే వేగలేకపోతుంటే ఈ బ్లాక్ ఫంగస్ ఏంటిరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. విశాఖలో వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్ ఇంకా ఎంత మందికి సోకిందోనని వైద్యులు ఆరా తీస్తున్నారు. ఇది కూడా కరోనాలా వ్యాపిస్తే మా గతేంటని ప్రజలు అల్లాడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో..
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలలో బ్లాక్ ఫంగస్ కేసు నమోదయిందని చెబుతున్నారు. ఇదే జరిగితే ఏపీలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ ను సైతం ఎదుర్కొనే విధంగా ఏపీ వాసులు పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది. వ్యాధుల జాబితా ఇలా పెరిగితే ప్రజలు బతికేదెలా? మనుగడ సాగించేదెలా అని ఎవరికి వారే ప్రశ్నించుకుంటున్నారు. కరోనా ప్రభావంతోనే వేగలేకపోతుంటే మరో రోగం రావడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఏపీ వాసులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎదురైందని చెప్పాలి.