YSR Congress Party : బిజెపితో తాడోపేడో.. కీలక బిల్లును వ్యతిరేకించిన వైసిపి.. ఇక యుద్ధమే!

కేంద్ర అవసరాల దృష్ట్యా వైసిపి మౌనం పాటించింది. స్పీకర్ ఎంపికలో అడిగిందే తడవుగా బిజెపికి మద్దతు ప్రకటించింది. ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకారం అందుతుందని భావించింది. కానీ బిజెపి పెద్దల వ్యవహార శైలిలో మార్పు రావడంతో.. జగన్ విపక్ష కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : August 9, 2024 1:59 pm
Follow us on

YSR Congress party : బిజెపి హై కమాండ్ తో జగన్ తాడోపేడోకు సిద్ధమయ్యారా? ఇక లాభం లేదని ఆ నిర్ణయానికి వచ్చారా? ఇండియా కూటమితో చేతులు కలపాలని చూస్తున్నారా? అందుకే పార్లమెంట్లో బిజెపి ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించారు? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల ముందు వరకు బిజెపితో వైసిపి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది. గత ఐదు సంవత్సరాలుగా బిజెపికి వైసిపి ఎనలేని సహకారం అందించింది. అవసరం ఉన్నా లేకున్నా కేంద్రం ప్రవేశపెట్టి బిల్లులకు మద్దతు తెలిపింది. ఏనాడు మారు మాట్లాడలేదు. అదే సమయంలో ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు కేంద్రం వైసీపీకి సాయం అందించేది. కానీ ఎన్నికల వ్యూహంలో భాగంగా టిడిపి తో జతకట్టింది బిజెపి. రాష్ట్రంలో టిడిపి కూటమిలో , కేంద్రంలో ఎన్డీఏలో పరస్పరం అధికారం పంచుకోవడంతో.. బిజెపి సైతం వైసీపీని దూరం పెట్టాల్సి వచ్చింది. అటు వైసీపీ సైతం ఏదో నిర్ణయం తీసుకోక అనివార్య పరిస్థితి. కేంద్రంలో కీలకంగా ఉన్న టిడిపి మాట కంటే.. తమను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే మొన్న ఇండియా కూటమి పార్టీలను సమీకరిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. కాంగ్రెస్ మినహాయించి ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. జాతీయస్థాయిలో మారిన రాజకీయ పరిస్థితులు, ఏపీలో పార్టీ ఉనికికి జగన్ ఇండియా కోటమి వైపు అడుగులు వేయని పరిస్థితి ఏర్పడింది.

* రాజ్యసభలో కీలకం
ఎన్డీఏ ప్రభుత్వ సుస్థిరతకు తెలుగుదేశం పార్టీ కీలకం. ఆ పార్టీ గెలిచిన 16 పార్లమెంటు స్థానాలు ఎన్డీఏ కు అవసరం. అదే సమయంలో రాజ్యసభలో బిజెపి బలం తాత్కాలికంగా తగ్గింది. వైసిపి పదకొండు మంది రాజ్యసభ సభ్యుల అవసరం ఏర్పడింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో బి జె డి బలం కూడా దూరమైంది. ఆ పార్టీకి 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడిని విభేదించి ఒంటరిగా పోటీ చేసిన బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే తనను మోసం చేసి బిజెపి అధికారంలోకి వచ్చిందని బిజెడి కోపంగా ఉంది. అందుకే ఆ పార్టీ సైతం బిజెపికి దూరమైంది. వైసీపీ సైతం యూటర్న్ తీసుకోవడంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చుక్కెదురు అయింది. రాజ్యసభలో బిజెపి మెజారిటీకి 12 ఎంపీ స్థానాలు దూరంగా ఉండడంతో కీలక బిల్లులకు మోక్షం కలగడం లేదు.

* బిల్లును వ్యతిరేకించిన వైనం
మరో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రయోజనం కోసం.. బిజెపి వాక్ఫ్ చట్టాన్ని సవరించాలని ప్రయత్నిస్తోంది. అందుకు సంబంధించి బిల్లును రాజ్యసభలో పెట్టింది. అంతకంటే ముందు లోక్సభలో ఆ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే ఇప్పటివరకు ఎన్డీఏకు సహకరించిన వైసిపి, బిజెడి వ్యతిరేకించాయి. అయితే లోక్ సభలో సంపూర్ణ బలం ఉండడంతో ఆ బిల్లు నెగ్గ కలిగింది. ఆ రెండు పార్టీలు వ్యతిరేకించడంతో కేంద్రానికి చుక్కెదురు అయ్యింది.

* జగన్ స్ట్రాంగ్ డెసిషన్
అయితే ఈ పరిణామంతో జగన్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్లమెంట్లో ఏపీ విషయంలో వైసీపీకి ఇండియా కూటమి పార్టీలు అండగా నిలుస్తున్నాయి. ఏపీలో అధికార కూటమితో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయంటూ ఇండియా కూటమిక్ పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే జగన్ ఇండియా కూటమిలోకి వెళ్లడం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే వైసిపి వ్యవహార శైలి పై అనుమానం వచ్చిన కేంద్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహం పన్నింది. ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. మరి కొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనుండడం.. బిజెపి బలం పెరగనుండడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. అంతవరకు బిల్లు జాప్యానికి నిర్ణయం తీసుకుంది. వైసిపి ఒక నిర్ణయానికి రాగా.. బిజెపి సైతం వైసీపీ విషయంలో సీరియస్ గా ఆలోచన చేయడం ప్రారంభించింది.