Somu Veerraju : బిజెపి సీనియర్ నేత సోము వీర్రాజు ఎట్టకేలకు తెరపైకి వచ్చారు. గత కొద్దిరోజులుగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. పెద్దగా కనిపించడం కూడా లేదు. ఇప్పుడు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తుండడంతో.. ఆయన తెరపైకి రావడం విశేషం. సోము వీర్రాజు బిజెపిలో సీనియర్. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. అందుకే హై కమాండ్ గుర్తించి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కేటాయించింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉన్నారు. అయితే ఆయన హయాంలో బిజెపి పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఏపీలో ఓటు బ్యాంకు పెంచుకోలేదు. పోటీ చేసిన ప్రతిసారి ఓటమి చవిచూసింది. వైసిపి హయాంలో జరిగిన ఉప ఎన్నికల్లో కనీస స్థాయిలో సైతం ఓట్లు దక్కించుకోలేకపోయింది.అయితే గత ఏడాది బిజెపి హై కమాండ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించింది. ఆయన స్థానంలో పురందేశ్వరిని నియమించింది. అప్పటినుంచి సైలెంట్ గా ఉన్నారు వీర్రాజు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. రెండు జాబితాల నామినేటెడ్ పోస్టుల్లో సైతం చాన్స్ లభించలేదు. అందుకే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు సోము వీర్రాజు.
* టిడిపి వ్యతిరేక ముద్ర
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకి అన్న ముద్ర సోము వీర్రాజు పై ఉంది. సోము వీర్రాజు బిజెపి అధ్యక్ష పదవిలో ఉండగా.. టిడిపి విషయంలో చాలా కఠినంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తి లేదని తేల్చేసేవారు. అదే సమయంలో వైసీపీ పట్ల సానుకూలంగా ఉండేవారు. ఒకానొక దశలో ఏపీలో అసలు బిజెపి టిడిపి వైపు వచ్చే అవకాశం లేదని.. ఎట్టి పరిస్థితుల్లో సోము వీర్రాజు పొత్తుకు విఘాతం కలిగిస్తారని అంతా భావించారు. అయితే సరిగ్గా ఎన్నికలకు 8 నెలల ముందు పావులు కదిపారు చంద్రబాబు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి రావడం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అదే సమయంలో ఈ ఎన్నికల్లో సోము వీర్రాజు పేరు వినిపించకుండా చేయగలిగారు. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి కానీ, ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయాలని సోము వీర్రాజు భావించారు. కానీ ఆయన గతంలో వ్యవహరించిన తీరుతో చంద్రబాబు కనీస స్థాయిలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు.
* పదవుల కోసమేనా
ఇప్పుడు ఏపీలో రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీ పదవుల ఎంపిక జరుగుతోంది. బిజెపి హై కమాండ్ ద్వారా తన పేరు ప్రకటించుకున్నా.. కూటమిపరంగా చంద్రబాబుతో పాటు పవన్ అనుమతి తప్పనిసరి. ఆ విషయం సోము వీర్రాజుకు తెలియంది కాదు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. అయితే ఇదంతా నామినేటెడ్ పదవుల కోసమేనని బిజెపి వర్గాలే చెబుతున్నాయి. ప్రస్తుతం బిజెపికి ముగ్గురు పార్లమెంట్ సభ్యులతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వీరెవరు సోము వీర్రాజు విషయంలో అనుకూలంగా లేరు. దీంతో తనకు పదవి దక్కాలంటే చంద్రబాబు అనుమతి తప్పనిసరి అని సోము వీర్రాజు భావించారు. అందుకే చంద్రబాబు సర్కారును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.