AP BJP: ఏపీలో( Andhra Pradesh) బిజెపి వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. జాతీయస్థాయిలో ఆ పార్టీ అధికారంలో ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలు దాదాపు బిజెపి ఏలుబడిలో ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పొత్తు లేకుండా ఒక్క అడుగు ముందుకు కూడా వేయలేని స్థితి ఆ పార్టీది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం సైతం బిజెపి పోరాడింది. విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏపీ విషయంలో ఎదురు నిలిచిన పార్టీ. అటువంటి పార్టీ ఇప్పుడు చేసింది చెప్పుకునేందుకు కూడా సహసించడం లేదు. ఆ ప్రయత్నమే చేయడం లేదు ఏపీ బీజేపీ నేతలు. దానికి కారణం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంటే.. అదే పార్టీ సాయంతో ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రాగలిగారు. అందుకే బిజెపి పోరాటాలు మరుగున పడిపోయాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. కానీ అప్పట్లో ఏపీ ప్రయోజనాల కోసం వెంకయ్య నాయుడుతో పాటు బిజెపికి చెందిన అరుణ్ జైట్లీ చివరి వరకు పోరాడారు.
* రాష్ట్రానికి ఎనలేని సాయం..
తాజాగా ఏపీకి బిజెపి( BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చాలా రకాలుగా సాయం అందిస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి మోడీ సర్కార్ ఏపీలో అమరావతి రాజధాని కి 15 వేల కోట్ల అందించింది. ఆపై రోడ్డు కం రైల్వే ప్రాజెక్టులు అదనం. పోలవరం ప్రాజెక్టుకు సైతం ఎనలేని సహకారం అందిస్తోంది. విశాఖలో భారీగా పెట్టుబడులు పెడుతోంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల రూపంలో. ఎంత చేస్తున్న ఏపీ బీజేపీ నేతలు దీనిపై పెద్దగా ప్రచారం చేయడం లేదు. దీనికి కారణం ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప మిగతా వారంతా టిడిపికి చెందిన నేతలే బిజెపిలో ఉండడం. ఆపై కేంద్ర పెద్దలు సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతో.. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి కూటమి మాటే చెల్లుబాటు అవుతుంది. కూటమిలో బిజెపి భాగస్వామ్యమే తప్ప.. కూటమి రాజకీయ ప్రయోజనాలు బిజెపికి దక్కడం లేదనేది విశ్లేషకుల వాదన.
* బలపడేందుకు అవకాశం..
అయితే ఏపీ బీజేపీ బలపడేందుకు చాలా రకాల అంశాలు దోహదపడతాయి. కానీ ఎందుకో ఆ ప్రయత్నం చేయడం లేదు ఏపీ బీజేపీ. వాస్తవానికి ఏపీలో టిడిపి కంటే బిజెపి సీనియర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న ఘనత బిజెపి ది. కానీ తరువాతే ఎందుకో ఆ పార్టీ విస్తరణ అనేది జరగలేదు. ఏపీ ప్రజల మధ్యకు బలంగా వెళ్లలేదు బిజెపి. అయితే నాడు విభజన సమయంలో బిజెపి కొట్లాటడం వల్లే చాలా రకాల ప్రయోజనాలు ఏపీకి దక్కాయి. కానీ బిజెపి వల్లే ఆ ప్రయోజనాలు దక్కాయని చెప్పడంలో.. ప్రజలకు వివరించడంలో ఏపీ బీజేపీ విఫలమవుతోంది. అప్పటికి ఇప్పటికీ ఆ పార్టీకి ఇదే మైనస్. ఇప్పటికైనా గుణపాఠా లు నేర్చుకోకుంటే మాత్రం ఆ పార్టీకి పొత్తులే శరణ్యం.
* బలం పెంచుకోలేకపోతున్న వైనం..
ఏదైనా రాజకీయ పార్టీ ఎదగాలని కోరుకుంటుంది. తమ పార్టీ నేతలు ఎదుగుదలను కోరుకుంటుంది. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. బిజెపి ఎదుగుదల కనిపించడం లేదు. రాజకీయంగా పార్టీ ఎదగడం లేదు. తన సొంత బలాన్ని నమ్ముకొని.. అభివృద్ధి చేసుకుంటేనే ఆ పార్టీకి మనుగడ. లేకుంటే మరో పార్టీ బలాబలాలపై బిజెపి ఆధారపడుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోకపోతే ఆ పార్టీ ఎదుగుదల అనేది కూడా సాధ్యం కాదు.