BC Leader Krishnaiah :వైసీపీకి మరో రాజ్యసభ సభ్యుడు గుడ్ బై చెప్పనున్నారా? ఈ మేరకు బిజెపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారా? రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ ముందుకు పోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు దూరమయ్యారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే వైసిపికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు తప్పించి అంత ఖాళీ అవుతారని ప్రచారం జరిగింది. కానీ ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే పార్టీ నుంచి దూరమయ్యారు. తాజాగా మరో నేత పేరు వినిపిస్తోంది. బిజెపి హై కమాండ్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆయన వైసీపీని వీడేందుకు సిద్ధపడినట్లు సమాచారం. దీంతో తెలంగాణతో పాటు ఏపీలో సైతం రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.
* పునరాలోచనలో నేతలు
అయితే ఐదేళ్లపాటు వైసీపీ నడిపించడం అంత ఈజీ కాదు. ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే నేతలు పునరాలోచనలో పడ్డారు. పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. ఇటీవల వైసిపికి చాలామంది నాయకులు గుడ్ బై చెప్పారు. ఇంకా మరి కొందరు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో మరో రాజ్యసభ సభ్యుడు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన తప్పకుండా వైసీపీని వీడుతారని టాక్ నడుస్తోంది. అయితే ఆ రాజ్యసభ సభ్యుడు టిడిపిలోకి కాకుండా.. బిజెపిలో చేరనుండడం హాట్ టాపిక్ గా మారింది.
* బీసీలకు పెద్దపీట
గత ఐదేళ్ల కాలంలో జగన్ వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో జాతీయస్థాయి బీసీ నేత కృష్ణయ్యకు పిలిచి మరి అవకాశం ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇది సొంత పార్టీలోనే ఒక రకమైన చర్చకు దారితీసింది. పార్టీలో ఎంతోమంది బీసీ నేతలు ఉండగా కృష్ణయ్యకు అవకాశం ఇవ్వడం ఏంటన్న ప్రశ్న వినిపించింది. అయితే వైసిపి అధికారానికి దూరం కావడంతో అదే కృష్ణయ్య..మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. బిజెపిలోకి వెళ్ళనున్నట్లు సమాచారం.
*అన్ని పార్టీల్లో గుర్తింపు
జాతీయస్థాయిలో కృష్ణయ్యకు మంచి పేరు ఉంది. బీసీ సంఘం నేతగా గుర్తింపు ఉంది. అదే గుర్తింపుతో అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు గౌరవించాయి. రాజకీయ అవకాశాలను కల్పించాయి. తొలుత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏకంగా నాయకత్వం బాధ్యతలను కృష్ణయ్యకు అప్పగించింది. అసెంబ్లీ టికెట్ కూడా కేటాయించింది. ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి.. కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ పై అనేక విమర్శలు వచ్చాయి. అయినా సరే పార్టీకి పనికొస్తుందని ఆయన భావించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో కృష్ణయ్య మైండ్ సెట్ మారినట్లు తెలుస్తోంది. బిజెపిలోకి వస్తే రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. అందుకే ఆయన త్వరలో బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.