Kadambari Jetwani Case : ముంబై నటి కదంబరి జెత్వాని కేసులో కీలక ట్విస్ట్. ముంబైలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబంపై కేసు నమోదు అయ్యింది. ముంబై నటి కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో నాటి వైసిపి ప్రభుత్వాన్ని ఆశ్రయించారు సదరు పారిశ్రామికవేత్త. అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది ఆ కేసు. ముంబైలో పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేందుకు సదరు నటిపై విజయవాడలో తప్పుడు కేసు నమోదు అయింది. నాటి ప్రభుత్వ పెద్దతో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించారు. ఓ వైసిపి నేత ఫిర్యాదుతో ముంబై నటిని రిమాండ్ కు తరలించారు. భయపెట్టి వేధించారు. చివరకు ఆమె కేసు విత్ డ్రా చేసుకుంది. ఇక్కడ ఆమెఫై నమోదైన కేసు వెనక్కి వెళ్ళింది. వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఊదంతాం తాజాగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో ఒక్కొక్కరిపై చర్యలకు ఉపక్రమిస్తోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా వైసీపీ నేతను అరెస్టు చేసింది. ఇలా అరెస్టు రిపోర్టులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేరును ప్రస్తావించింది. దీంతో వారిపై సైతం ఉచ్చు బిగిస్తోంది.
* వరుసగా వేటు
ఇప్పటికే ఈ కేసులో ఐపీఎస్ అధికారులతో పాటు పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రధానంగా ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీల పేర్లు బయటపడ్డాయి. వీరి ప్రమేయం తోనే పోలీస్ శాఖ కేసు నమోదు చేసి హింసించిందని తేలింది. రాష్ట్ర డిజిపి ఇదే మాదిరిగా నివేదికలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వీరిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్షణంలోనైనా వీరిపై ఎఫ్ ఐ ఆర్ నమోదవుతుందని అంతా భావించారు. ఇప్పుడు ప్రధాన నిందితుడు రిమాండ్ రిపోర్ట్ లో వీరి పేరు ప్రస్తావన రావడంతో.. వీరి అరెస్ట్ ఖాయమని తేలింది.
* కుక్కల విద్యాసాగర్ అరెస్టుతో
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఉన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు మాత్రమే ముంబై నటిని అరెస్టు చేశారు. వెంటాడారు.. వేధింపులకు గురి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు తెరపైకి రావడంతో విద్యాసాగర్ పరారీలో ఉన్నాడు. డెహ్రాడూన్ లో ఉండగా ఆయనను అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. విజయవాడ తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రస్తావించడం విశేషం.
* అధికారుల నుంచి సిబ్బంది వరకు
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ2గా, కాంతి రాణా టాటా ఏ3గా, విశాల్ గున్ని ఏ 4 గా,విజయవాడ వెస్ట్ జోన్ ఏసిపి హనుమంతరావు ఏ 5 గా, ఇబ్రహీంపట్నం సీఐ సత్యన్నారాయణ ఏ 6 గా కేసు నమోదు చేశారు.
ఈ కేసు వెలుగులోకి రావడం, బాధితురాలు తెరపైకి వచ్చి ఫిర్యాదు చేయడంతో వీరిపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. సస్పెన్షన్ వేటు వేసింది.ఈ క్షణంలోనైనా అరెస్టు ఖాయమని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు రిమాండ్ రిపోర్టులో వీరి పేర్లను ప్రస్తావించింది. త్వరలో వీరి అరెస్టు ఖాయమని సంకేతాలు ఇచ్చింది. మొత్తానికి అయితే ముంబై నటి కేసులో ఏపీ పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉంది.