AP BJP: ఏపీలో( Andhra Pradesh) బిజెపి బలపడుతోంది అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఏపీలో బిజెపి బలోపేతం అయ్యేందుకు చేయని ప్రయత్నం లేదు. అయితే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మిగతా రాష్ట్రాల్లో బిజెపి పర్వాలేదనిపిస్తోంది. కర్ణాటకలో చాలాసార్లు అధికారంలోకి వచ్చింది. బలమైన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. తెలంగాణలో సైతం గణనీయమైన వృద్ధి సాధించి ఓట్లతోపాటు సీట్లు పెంచుకుంది. తమిళనాడులో అన్నాడీఎంకేతో ముందుకు సాగుతోంది. కేరళలో మాత్రం ప్రభావం చాటేందుకు చేయని ప్రయత్నం లేదు. అయితే ఇప్పుడు ఏపీలో అధికార భాగస్వామ్య పక్షంగా ఉంది. దీంతో ఇక్కడ సైతం బలం పెంచుకునే పనిలో పడింది.
* టిడిపి కంటే సీనియర్..
వాస్తవానికి ఏపీలో బిజెపి( Bhartiya Janata Party) తెలుగుదేశం పార్టీ కంటే సీనియర్. 1982లో టిడిపిని ఏర్పాటు చేశారు నందమూరి తారక రామారావు. కానీ అదే సమయానికి విశాఖ నగరపాలక సంస్థను గెలుచుకున్న ఘనత బిజెపిది. అప్పట్లో వాజ్పేయి నేతృత్వంలో బిజెపి ఉండగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ పదవి డైరెక్ట్ గా పోటీ జరిగింది. ఆ సమయంలో డివి సుబ్బారావు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతటి ఘన చరిత్ర ఉన్న బిజెపి కార్యక్రమం లో ఏపీలో పొత్తులపై ఆధారపడుతూ ముందుకెళ్తోంది. కేవలం పొత్తులు ఉన్న సమయంలో మాత్రమే ఓట్లతోపాటు సీట్లు పెంచుకుంటుంది. మొన్నటి ఎన్నికల్లో సైతం మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. అయితే స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది బిజెపి.
* బీసీలపై ఫోకస్..
తాజాగా బీసీ ( backward caste ) వర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది బిజెపి. ఇప్పటికే తెలంగాణలో బీసీ ప్రయోగం చేసింది. ఏపీవ్యాప్తంగా బీసీ నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో పడింది. తాజాగా నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రతినిధి ఒకరు బిజెపిలో చేరారు. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకేసారి 30 మంది సర్పంచులు బిజెపిలో చేరడం నిజంగా శుభ పరిణామం. ఎందుకంటే ఈ స్థాయిలో చేరికలు ఉన్నాయంటే.. కచ్చితంగా బిజెపి ఏపీలో బలపడే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పివిఎన్ మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత రాయలసీమ పై ఫుల్ ఫోకస్ చేశారు. రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిలో ఉంది. మరోసారి కూటమి అక్కడ హవా చాటాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలి. అందుకే ఇప్పుడు ఆ పనిలో ఉంది బిజెపి. నిస్సహాయతగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను బిజెపిలోకి రప్పిస్తోంది. అయితే ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో బిజెపి మరిన్ని సీట్లు పెంచుకునే పరిస్థితిలో ఉంది. అయితే ఆ ప్రయత్నాలు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.