AP Inter Exams Update: ఏపీలో( Andhra Pradesh) ఇంటర్ బోర్డు సంస్కరణలకు సిద్ధపడుతోంది. ముఖ్యంగా పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పరీక్ష వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు నిర్ణయించింది. సాధారణంగా ఇంటర్ పరీక్షలు అంటేనే మార్చిలో నిర్వహిస్తూ వస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించడం విశేషం. సీబీఎస్ఈ తో పాటు స్టేట్ సిలబస్ కు సంబంధించి ఒక నెల ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం విశేషం. ఫిబ్రవరిలోనే పరీక్షలు పూర్తిచేసి.. ఏప్రిల్ నుంచి కొత్త అకడమిక్ ఈయర్ ప్రారంభించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే తరగతులు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
* పరీక్ష విధానంలో మార్పు..
పరీక్ష విధానంలో కూడా సమూల మార్పులు తీసుకురానుంది ఇంటర్ బోర్డు( inter board). మొదట సైన్స్ విద్యార్థులకు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభం అవుతాయి. రోజుకు ఒక్క సబ్జెక్టు పరీక్ష ఉంటుంది. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు.. అదేరోజు బైపిసి, ఆప్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు మాత్రం ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే.. ఆరోజు ఆ సబ్జెక్టు ఒక్కటే ఉంటుంది. మరోవైపు ఎం బైపీసీ గ్రూపును తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులు సైతం జీవశాస్త్రం చదివే అవకాశం వచ్చింది. అందుకే ఒకరోజు ఒకే పరీక్ష పెట్టారు. సైన్స్ గ్రూప్ సబ్జెక్టులన్నీ పూర్తయిన తర్వాతే.. చివరిలో లాంగ్వేజ్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు ఉంటాయి. అనంతరం ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే ఫిబ్రవరిలో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్న దృష్ట్యా.. జనవరిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
* సంస్కరణల దిశగా..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ బోర్డు సంస్కరణల దిశగా అడుగులు వేసింది. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్లో అనేక సంస్కరణలు తెచ్చింది. పూర్తిగా ఎస్సీఈఆర్టీ సిలబస్ను అమలు చేశారు. ఎం బైపీసీ, జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే అవకాశాన్ని సైతం కల్పించారు. ఆర్ట్స్ విద్యార్థులకు సైతం సైన్స్ సబ్జెక్టులు ఎంచుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. అదే సమయంలో సైన్స్ గ్రూపు విద్యార్థుల సైతం హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ వంటి సబ్జెక్టులు ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చారు. మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి ప్రశ్నపత్రాల విధానాన్ని కూడా మార్చారు. ఇప్పుడు పరీక్షలు ముందుగానే నిర్వహించి.. ముందుగానే విద్యా సంవత్సరం ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నారు. దీనిపై ఇంటర్ బోర్డు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.