Pawan Kalyan: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతుంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడంపై డిప్యూటీ సీఎం పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లోకి శాంతి భద్రతల అంశం బలంగా వెళ్లడంతో ఆయన స్పందించారు.ఇలానే పరిస్థితి కొనసాగితే తాను హోం మంత్రి పదవిని తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు. అప్పటినుంచి ఒక రకమైన రచ్చ ప్రారంభం అయ్యింది. దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. తప్పులు సరిదిద్దుకొని ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు. డిజిపి ద్వారకాతిరుమలరావు సైతం స్పందించారు. తాము రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే శాంతిభద్రతలు అదుపు తప్పాయని.. వాటిని సరిచేసుకుంటూ వస్తున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. హోంమంత్రి వంగలపూడి అనితను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో కూటమిలో విభేదాలు ప్రారంభమయ్యాయని ప్రచారం చేస్తోంది వైసిపి. మరోవైపు పవన్ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* తాజా పరిణామాల నడుమ
అయితే సరిగ్గా ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తుండడం విశేషం. ఈరోజు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఈ మేరకు అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేరుగా అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసిపి ప్రభుత్వ హయాంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇప్పుడు పవర్ లోకి వచ్చిన తర్వాత పవన్ ఏం చేస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ కీలక మలుపుల నేపథ్యంలో పవన్ నేరుగా ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* సనాతన ధర్మంపై చర్చించేందుకు
సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన ప్రచారం నడుస్తోంది. బీహార్ బిజెపి నేతలు అయితే ఆహ్వానిస్తున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో హిందుత్వవాదం ఎక్కువ. అందుకే పవన్ వ్యాఖ్యలపై అక్కడ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఈ అంశంపై పవన్ మాట్లాడే అవకాశం ఉందని.. అమిత్ షా అభిప్రాయం తెలుసుకొని పవన్ మరింతగా సనాతన ధర్మంపై మాట్లాడతారని తెలుస్తోంది. అయితే ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పవన్ ఢిల్లీ వెళ్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో జాతీయ అంశాలు సైతం వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతోంది.