Superstar Krishna statue issue: తెలంగాణలో( Telangana) ఇప్పటికీ ప్రాంతీయవాదానికి సంబంధించిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. మొన్న మధ్యన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు చాలామంది అభ్యంతరాలు తెలిపారు. దీనిపై వివాదం కూడా నడిచింది. చివరకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఆంధ్ర ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలు వస్తే పర్వాలేదు. కానీ మన రాష్ట్రంలో కూడా ఏపీ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలతో పాటు వివాదాలు ఏర్పడుతున్నాయి. ఇది ముమ్మాటికి ఇబ్బందికరమే. ముఖ్యంగా ఆ మధ్యన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని మున్సిపల్ యంత్రాంగం నోటీసు జారీ చేయడం చూస్తుంటే.. ఏంటి పరిస్థితి అన్నట్టుగా మారింది.
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం పై గోల..
సూపర్ స్టార్ కృష్ణ( superstar Krishna) అంటే సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమే. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను అందుబాటులోకి తెచ్చారు కృష్ణ. కొత్త ప్రయోగాలకు ఆయన వేదికగా మారారు. చిత్ర పరిశ్రమ విస్తరణకు తనవంతు సహకారం అందించారు. అటువంటి వ్యక్తికి సంబంధించిన విగ్రహం ఏర్పాటు చేస్తామంటే అభ్యంతరం చెప్పకూడదు కూడా. గత ఏప్రిల్ లోనే భీమవరం మున్సిపాలిటీలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అభిమానులు. దానిని తొలగించాలంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే మున్సిపాలిటీ అనుమతులు తీసుకొని తాము ఏర్పాటు చేశామని అభిమానులు చెప్పుకొచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కృష్ణ విగ్రహాన్ని తొలగించాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పడంతో అభిమానులు కోర్టును ఆశ్రయించారు. చివరకు ఆ విగ్రహ తొలగింపు అనేది నిలిచిపోయింది.
తెలుగు నటులు, కళాకారులు..
భారతీయ చిత్ర పరిశ్రమ( Indian cinema industry) గర్వించదగ్గ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అన్ని భాషల్లో పాటలు పాడిన గాన గంధర్వుడు ఆయన. ప్రాంతాలతో సంబంధం లేకుండా తన పాటతో సమాజాన్ని మేల్కొలిపిన గొప్ప గాయకుడు. అటువంటి గాయకుడిలో ప్రాంతీయ తత్వాన్ని చూశారు తెలంగాణలో కొంతమంది. రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం అవుతోంది. ఇటువంటి సమయంలో అలాంటి విభేదాలు తెచ్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. బాలసుబ్రమణ్యం ఏపీకి చెందిన గాయకుడే కావచ్చు. కానీ ఆయన మన తెలుగు భాషకు, పాటకు ప్రాణం పోసిన వ్యక్తి. సూపర్ స్టార్ కృష్ణ కూడా అంతే. తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే గుర్తింపు సాధించడం వెనుక అటువంటి వారి కృషి ఉంది. అటువంటి హీరో విగ్రహ ఏర్పాటు విషయంలో అంత కఠినంగా వ్యవహరించడం అంటే మనల్ని మనం అగౌరవ పరుచుకోవడమే.