Bharat Ratna for NTR: దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీని గడగడలాడించారు నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao). ఢిల్లీ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటైన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలకు దేశంలోనే దిక్సూచిగా నిలిచింది. జాతీయ రాజకీయాల్లో సైతం తెలుగుదేశం పార్టీ తనదైన ముద్ర చాటుకుంది. అయితే ఈ కారణం తోనే ఎన్టీఆర్ కు అందాల్సిన గౌరవాలు మాత్రం జాతీయస్థాయిలో అందకుండా పోయాయి. ముఖ్యంగా భారతరత్న విషయంలో నందమూరి తారక రామారావుకు లోటే. అదొక్కటే కాదు పద్మభూషణ్, పద్మ విభూషణ్ లాంటి అవార్డులను సైతం ఆయన పొందలేకపోయారు. కేవలం ఒక్కసారి మాత్రమే ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. రాజకీయాల్లో ఆయన రాణించడం మూలంగానే అవార్డులు వరించలేదన్న విమర్శ ఉంది.
జాతీయస్థాయిలో ఎనలేని పాత్ర..
1982లో తెలుగుదేశం ( Telugu Desam)పార్టీని ఏర్పాటు చేశారు నందమూరి తారక రామారావు. 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 1989లో అధికారాన్ని కోల్పోయింది. కానీ జాతీయ రాజకీయాల్లో టిడిపి ప్రభావం చూపింది. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే అప్పుడే ఆయనకు అవార్డులకు బ్రేక్ పడింది. ఎప్పుడైతే జాతీయ రాజకీయాలను ఎన్టీఆర్ టచ్ చేశారో.. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆయనపై కత్తి కట్టింది. పద్మ అవార్డుల విషయంలో ఎన్టీఆర్కు తీరని అన్యాయం జరిగింది. రాజకీయాల్లో ఎన్టీఆర్ ది చెరగని ముద్ర. ఎన్నో విప్లవాత్మకమైన పాలనా సంస్కరణలను తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. అటువంటి నేతను గౌరవించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్టీఆర్ విషయంలో చాలా నిర్లక్ష్యం చేశాయి. పోనీ అనుకూల ప్రభుత్వాలు సైతం సానుకూల నిర్ణయం తీసుకోలేదు.
అనుకూల ప్రభుత్వాలు ఉన్నా..
నందమూరి తారక రామారావుకు భారతరత్న( Bharat Ratna) అవార్డు ఇవ్వాలని దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. 1996లో చనిపోయారు ఎన్టీఆర్. ఆయన భౌతికంగా దూరమై మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఆయనకు దక్కాల్సిన గౌరవం మాత్రం దక్కలేదు. తెలుగు నేతల్లో పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు వచ్చింది. కానీ నందమూరి తారక రామారావు విషయంలో మాత్రం అందని ద్రాక్షగా ఉంది. 1989లో అదే ఎన్టీఆర్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. 1999 నుంచి 2004 మధ్య వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో సైతం చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. అటు తరువాత 2004 నుంచి 2014 వరకు ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కేంద్రమంత్రిగా ఉండేవారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా టిడిపి కీలక భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ అధికారంలో ఉంది. అయినా సరే భారతరత్న ఎన్టీఆర్కు సాకారం కావడం లేదు. అయితే కుటుంబ పరమైన అభ్యంతరాలతోనే ఆయనకు భారతరత్న రాలేదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. ఎన్టీఆర్కు వారసులు 30 మంది వరకు ఉన్నారు. వారంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.. అయితే భారతరత్న ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న ప్రచారం కూడా ఉంది. తప్పకుండా సాధిస్తాం అన్న ప్రకటనలు కూడా టిడిపి అధినేతల నుంచి వస్తున్నాయి. అయితే కార్యరూపం దాల్చకపోవడం మాత్రం నిజంగా లోటే. నిజంగా దీని వెనుక ఏం జరిగింది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.
