YS Jaganmohan Reddy : కొందరు నేతల తీరుతో జగన్ తెగ బాధపడుతున్నారు.ఎంతో నమ్మకంతో ఉండి.. పార్టీ పదవులు అనుభవించిన వారు.. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెబుతుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అటువంటి వారి విషయాన్ని పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తూ బాధపడి పోతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. 11 స్థానాలు మాత్రమే సాధించి పార్టీ శ్రేణులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న నేతలు ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఒక వెలుగు వెలిగి.. పదవులు అనుభవించిన వారు సైతం పక్కకు తప్పుకుంటున్నారు. అధినేత జగన్ కు అత్యంత వీర విధేయులు, ఆత్మీయులు కూడా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎవరు పార్టీ నుంచి వెళ్ళిపోయినా తనకు బాధ లేదని.. మళ్లీ పార్టీని పునర్ నిర్మించుకుంటానని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన తల్లితోపాటు తాను మాత్రమే వచ్చానని గుర్తు చేసుకుంటున్నారు. 2029 నాటికి పార్టీని మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయిస్తానని కూడా చెబుతున్నారు. అయితే లోలోపల మాత్రం తన బాధను అలాగే ఉంచుకున్నారు. కొంతమంది నేతలు చివరి వరకు తన వెంట ఉంటారని జగన్ భావించారు. అటువంటి వారు ఇప్పుడు ఉన్నఫలంగా తనను విడిచిపెట్టి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. వారిని తలచుకొని బాధపడుతున్నారు జగన్.
* బాలినేని విషయంలో
ప్రకాశం జిల్లా కు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరారు. ఈయన జగన్ కు సమీప బంధువు. అందుకే వైసిపి ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. జగన్ సైతం ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో గెలిచిన వెంటనే క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను ఆయనకే కట్టబెట్టారు. అయితే వివిధ సమీకరణలో భాగంగా మంత్రివర్గ విస్తరణలో ఆయనను తొలగించారు. అక్కడ నుంచి జగన్ పై అసంతృప్తితో రగిలిపోయారు బాలినేని. అంతకుముందు ఇచ్చిన అవకాశాలను గుర్తు చేసుకోకుండా పార్టీకి గుడ్ బై చెప్పారు. బాలినేని విషయంలో జగన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయినవారే మోసం చేశారని బాధపడుతున్నట్లు సమాచారం.
* మోపిదేవి అలా చేస్తారనుకోలేదు
మరోవైపు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విషయంలో కూడా జగన్ బాధపడుతున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో మోపిదేవి వెంకటరమణ పై కూడా అభియోగాలు ఉన్నాయి. జగన్ తో పాటు మోపిదేవి జైలు జీవితం అనుభవించారు. అప్పుడే వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. రాజకీయంగా ఒకే ప్రయాణం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంట ఉంటానని మోపిదేవి చెప్పుకొచ్చారు. అందుకే మోపిదేవి ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్. అటు తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి కేంద్ర రాజకీయాల్లోకి పంపించారు. అయితే ఇంత చేసినా మోపిదేవి జగన్ ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇంతటి కష్టాల్లో ఉంటే ఉన్నపలంగా విడిచిపెట్టి వెళ్లిపోవడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. సన్నిహితులు వద్ద తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేస్తున్నారు.