AP Liquor Scam Case: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. వైసిపి హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని టిడిపి కూటమి అనుమానించింది. దేశంలోనే ఇది పెద్ద కుంభకోణంగా టిడిపి అనుకూల మీడియా పతాక శీర్షికన కథనాలు రాసింది. దాదాపు ఓ 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. తొలుత కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అప్పటి జగన్ ఓ ఎస్ డి కృష్ణ మోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టయ్యారు. అటు తరువాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టు జరిగింది. ప్రత్యేక విచారణ బృందం సిట్ రెండుసార్లు కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అయితే ఇందులో లోపాలు ఉన్నాయని.. ఆధారాలు సరిగ్గా లేవని చెబుతూ.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు కోర్టు బెయిల్ ఇచ్చింది. మిగతా నిందితుల విషయంలో సైతం కొత్త చర్చకు దారితీస్తోంది. మిగతా వారికి సైతం బెయిల్ లభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మధ్యంతర బెయిల్ పొందిన సంగతి తెలిసిందే.
* చార్జిషీట్లలో లోపాలు..
అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం( sit ) పక్కా ఆధారాలతో ముందుకెళ్తోందని టిడిపి అనుకూల మీడియా రాసుకొచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలుత ఈ కేసులో అసలు ఆధారాలు లేవని.. ఈ కేసులు కూడా నిలబడవని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజా బెయిల్ ఎపిసోడ్ చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. అయితే ఒకానొక దశలో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వణికిపోయింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టుతో వైసిపి నేతల నోట మాట రాలేదు. అయితే ఇప్పుడు ఈ కేసులో బెయిల్ లభిస్తుండడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. టిడిపి కూటమి ప్రభుత్వం అనుకున్నది సాధించిందా? లేకుంటే ఈ విషయంలో వెనుకబడిందా? అనే రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే మద్యం కుంభకోణానికి సంబంధించి గత 10 నెలలుగా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది.
* అంతా వ్యూహాత్మకమే
అయితే మద్యం కుంభకోణం( liquor scam ) విషయంలో ఒక వ్యూహం ప్రకారం టిడిపి కూటమి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. వైసిపి హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్లు సొంత పార్టీ నేతలకు అనుమానం వచ్చేలా ఎపిసోడ్ నడిచింది. అప్పట్లో మద్యం పాలసీ లోపాల పుణ్యమా.. తప్పకుండా తప్పిదాలు చోటుచేసుకుని ఉంటాయని ప్రజలు భావించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది కాలంలో బలంగా ప్రజల్లోకి వెళ్ళలేక పోయింది. దానికి కారణం ముమ్మాటికి మద్యం కుంభకోణం. వైసిపి హయాంలో భారీ కుంభకోణం జరిగి ఉంటే.. ఇప్పటి కూటమి ప్రభుత్వంపై ఎలా ఆందోళనలు చేస్తారన్న ప్రశ్న కూడా సొంత పార్టీ నుంచి వినిపించింది. వైసిపి ప్రజల్లో చులకన అయిన తరుణంలో.. అదే ప్రజల్లోకి మళ్లీ వెళ్లలేమని చాలామంది పార్టీ శ్రేణులు బాహటంగానే వ్యాఖ్యానించాయి. మద్యం కుంభకోణం అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాయని మచ్చ. ఈ విషయంలో మాత్రం టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది.
* పూర్తి స్వేచ్చనిచ్చిన ప్రభుత్వం..
మద్యం కుంభకోణం కేసులో ఆధారాలు లేవని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలు భావించారు. అయితే కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన తరువాత మాత్రమే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి నేతలను అరెస్టు చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల అరెస్టులు అలానే జరిగాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసి.. కోర్టు సరెండర్ కావాలని ఆదేశించిన తర్వాత మాత్రమే వారి అరెస్టులు జరిగాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఈ నేత ఏ కేసులో అరెస్టు జరిగి శిక్ష పడే పరిస్థితి అయితే లేదు. అందుకే మద్యం కుంభకోణం కేసులో టిడిపి కూటమి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారులను జైలుకు పంపించగలిగింది. కుంభకోణం పై ప్రజల్లో చర్చ జరిగేలా చేసింది. విపక్షాన్ని ఎదగకుండా చేసింది. వారిని ప్రజల్లోకి వెళ్లకుండా నియంత్రించగలిగింది.