Avinash Reddy Arrest: ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో సమస్యాత్మక ప్రాంతాలలో గొడవలు జరుగుతుంటాయి. కానీ జెడ్పిటిసి ఎన్నికలు అది కూడా ఉప ఎన్నికల్లో గొడవలు జరగడం ఇదే తొలిసారి. పైగా అది మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో కావడం విశేషం. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
Also Read: రాహుల్ గాంధీకి వ్యతిరేక వ్యాఖ్యలు.. మంత్రి పదవి ఊస్ట్! ఇదీ కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం
సోమవారం రాత్రి కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన పులివెందులలోని తన ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇది కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అవినాష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు తనను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మీద కక్ష కట్టారని.. అన్ని విభాగాలలో విఫలమయ్యారని మండిపడుతున్నారు.
పులివెందులలో జడ్పిటిసి ఎన్నికల సమయంలో ఆందోళనలు, గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలకు దిగుతున్నారు. అవినాష్ రెడ్డిని మాత్రమే కాకుండా టిడిపి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలో ఎటువంటి నిరసనలు, ఆందోళనలు జరగకుండా కీలక నేతలను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు వరుస పరిణామాలతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని పులివెందుల ప్రజలు చెబుతున్నారు.
ఇక పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానాల ఉప ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పులివెందుల ప్రాంతంలో 10,601 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 30 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు మొత్తం రెండు మండలాల్లో 1400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రశాంతమైన పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు సోమవారం సాయంత్రమే స్థానికేతరులను బయటికి పంపించారు.