Jagan: ఏపీలో నేతల విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనల ఖర్చుకు సంబంధించిన రచ్చ నడుస్తోంది. ప్రైవేటు పర్యటనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఖర్చులు చూపించారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార కూటమిని టార్గెట్ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పర్యటనలు, విమాన ఖర్చులు ఇవి అంటూ సాక్షి మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అయితే వాటికి పక్కా ఆధారాలు చూపించలేకపోతున్నారు. అయితే ఆధారాలతో తెలుగుదేశం కౌంటర్ ఇస్తుండడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశంగా మారింది.
* ఒక్క రూపాయి ఖర్చు పెట్టని లోకేష్..
ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి లోకేష్ పై దృష్టి పెట్టింది. గడిచిన 18 నెలల కాలంలో చాలాసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు లోకేష్. ఆపై తరచూ హైదరాబాద్ వెళుతూ వస్తున్నారు. ఢిల్లీ పర్యటనలకు సైతం వెళ్తున్నారు. అయితే ఈ విమాన ఖర్చులన్నింటినీ ప్రభుత్వం భరిస్తోందని సాక్షి మీడియాలో పతాక శీర్షిక కథనాలు వచ్చాయి. దీనిపై టిడిపి కూడా ఘాటుగానే స్పందించింది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి సోషల్ మీడియాలో పెట్టారు. గడిచిన 18 నెలల కాలంలో లోకేష్ చాలా పర్యటనలకు వెళ్లారని.. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్నది తెలుగుదేశం పార్టీ మాట. అయితే ఫ్యాక్ట్ చెక్ సైతం ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పింది. లోకేష్ విమాన ఖర్చులన్నీ ఆయనే సొంతంగా భరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. చివరకు ప్రభుత్వంతో పాటు అధికారిక కార్యక్రమాలకు హాజరైన క్రమంలో సైతం లోకేష్ సొంత ఖర్చులను భరిస్తున్నారు.
* జగన్ ఖర్చులు బయటకు..
లోకేష్ తో పాటు కూటమి పెద్దల విషయంలో వైసిపి చేస్తున్న ప్రచారానికి చెక్ చెప్పాలని భావించింది తెలుగుదేశం. ఐదేళ్ల వైసిపి హయాంలో జగన్మోహన్ రెడ్డి విమాన ఖర్చులు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుందట. ఐదేళ్ల కాలంలో 222 కోట్ల రూపాయలు విమాన ఖర్చులకోసం రాష్ట్ర ప్రభుత్వం భరించింది అంటూ సోషల్ మీడియాలో టిడిపి ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నోరు తెరవడం లేదు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పది కిలోమీటర్ల దూరాన్ని సైతం హెలిక్యాప్టర్ పై వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదేం తప్పు కాదు కదా అన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పేవారు. ఇప్పుడు లోకేష్ విషయంలో దుష్ప్రచారం జరగడంతో దానిపై క్లారిటీ ఇస్తూ టిడిపి ఈ కొత్త ప్రచారానికి తెర తీసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బదనం అయినట్టు కనిపిస్తోంది.