Avanthi Srinivas joins Janasena: జనసేనలో చేరికలకు రంగం సిద్ధం అవుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. 14 మంది నేతలతో కూడిన ఈ కమిటీ జనసేనలో చేరికల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ప్రధానంగా వివిధ పార్టీల్లో పనిచేస్తున్న వారు, తటస్తులు, విద్యాధికులను పరిశీలించి పార్టీలోకి ఆహ్వానించనుంది. అయితే ఈ కమిటీ ఓ మాజీ మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసి పొలిటికల్ జంక్షన్ లో నిలబడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన జనసేనలో చేరడం ఖాయమని ప్రచారం ప్రారంభమైంది. ఒక్క అవంతి శ్రీనివాసరావు మాత్రమే కాదు.. చాలామంది నేతల చేరికకు తెరవెనుక కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది.
మొన్నటి ఎన్నికల్లో ఓటమి..
మొన్నటి ఎన్నికల్లో భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అవంతి శ్రీనివాసరావు. ఆయనపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు భారీ మెజారిటీతో గెలిచారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అవంతి శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించారు. కానీ అక్కడ గంటా శ్రీనివాసరావు రూపంలో బలమైన నాయకుడు ఉన్నారు. ఆయన అభ్యంతరంతో టీడీపీ నాయకత్వం అవంతి శ్రీనివాసరావుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు జనసేన చేరికలకు ప్రోత్సహిస్తున్న తరుణంలో అవంతి శ్రీనివాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పిఆర్పి ద్వారా ఎంట్రీ..
ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు. 2009లో తొలిసారిగా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో కు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన అవంతి శ్రీనివాసరావు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగారు. ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అవంతి శ్రీనివాసరావుకు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి భీమిలి నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో అవంతి శ్రీనివాస్ రావు కు చాన్స్ ఇస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
