Farmer Agony  : మూగ జీవి మరణ వేదన.. రైతు ఆవేదన.. కళ్లెదుటే పాడెద్దు మృతి! హృదయం ద్రవించే కథనం

కళ్లెదుటే ఇష్టమైనవారు మరణిస్తే.. వారిని కాపాడుకోవడంలో విఫలమైతే.. ఆ వేదన అంతా ఇంతా కాదు. అదే వేదనను ఎదుర్కొన్నాడు ఓ రైతు. తన కష్టంలో పాలుపంచుకున్న కాడెద్దు మృతి చెందడంతో గుండెలవిసేలా రోదించాడు.

Written By: Dharma, Updated On : August 13, 2024 12:23 pm

Farmer Agony

Follow us on

Farmer Agony :వ్యవసాయంలో కాడెద్దుల పాత్ర మరువరానిది. దుక్కి దున్ని.. విత్తు విత్తడం దగ్గర నుంచి.. పుట్టిన పంటను ఇంటికి చేర్చే వరకు కాడెద్దులు రైతుకు సహాయకారిగా ఉండేవి. ప్రతి రైతు ఇంటా కాడెద్దులు కనిపించేవి. రైతులు పోటీపడి పెంచేవారు. వాటిలోనే దర్పం చూపేవారు. కానీ కాలం మారింది. కాల గమనం మారుతోంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతోంది. కాడెద్దులతో ఒకరోజు చేసే పనిని యంత్రాలతో.. గంట వ్యవధిలోనే ముగిస్తున్నారు. దీంతో కాడెద్దులు కట్టి.. నాగలి పట్టి రైతులు కనుమరుగవుతున్నారు. అయితే చాలామంది రైతులు పశువుల పై ప్రేమ చూపుతూనే ఉన్నారు. కాడెద్దులపై ఆధారపడి వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ప్రతి గ్రామంలో ఇటువంటి రైతులు తారస పడుతుంటారు. పిల్లలతో సమానంగా కాడెద్దులను పెంచుకుంటారు. వాటికి ఏ కష్టం రానివ్వరు. ఏదైనా ప్రమాదం జరిగితే విలవిలలాడిపోతారు. అటువంటి పరిస్థితి ఎదురయింది ఆశీర్వాదం అనే రైతుకు. వరి వంగడాలతో వస్తున్న ఎద్దుల బండి కాలువలో పడిపోయింది. ఊపిరాడక ఒక ఎద్దు చనిపోయింది. చనిపోయిన ఎద్దు వద్ద ఆశీర్వాదం దంపతులు రోధించిన తీరు హృదయ విదారకంగా ఉంది.

* వరి వంగడాలు తీసుకెళ్తుండగా..
వైయస్సార్ జిల్లా దువ్వూరు ఎస్సీ కాలనీకి చెందిన ఆశీర్వాదం అనే రైతుకు కొద్దిపాటి భూమి ఉంది. అందరు మాదిరిగానే ఆయన యంత్రాలపై ఆధారపడలేదు. కాడెద్దులతోనే వ్యవసాయం చేసుకునేవాడు. కాడెద్దులను అపురూపంగా చూసుకునేవాడు. వాటిని కన్నబిడ్డల సాకేవాడు. వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోయేవాడు. ఆశీర్వాదమును చూసి అందరూ మురిసిపోయేవారు.

*అపురూపంగా పెంపకం
వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నా.. కాడెద్దుల బాధ్యతను ఎన్నడూ విడిచేవాడు కాదు ఆశీర్వాదం. ఈ క్రమంలో వరి వంగడాలను నాటు బండిలో తరలిస్తుండగా.. కాడెద్దులు ఒక్కసారిగా బెదిరిపోయాయి. బండి ఒక్కసారిగా ఏసీ కాలువలో దూసుకెళ్లింది. ఎద్దుల తో పాటు రైతు ఆశీర్వాదం కూడా నీటిలో మునిగిపోయాడు. అదృష్టవశాత్తు రైతు ఈదుకుంటూ గట్టుపైకి చేరుకున్నాడు. రెండు ఎడ్లలో ఒకదానికి ఉన్న పట్టెడ తెగిపోవడంతో అది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. మరో ఎద్దు మాత్రం నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనకు రైతు ఆశీర్వాదం ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.

* ఎద్దు గల్లంతు
వరి వంగడాలతో పాటు బండి, ఎద్దు కాలువలో గల్లంతయింది. చివరకు క్రేన్ సాయంతో స్థానికులు ఆ బండిని బయటకు తీశారు. అప్పటికే ఆ ఎద్దు చనిపోయింది. ఆ ఎద్దును పట్టుకొని రైతు ఆశీర్వాదం దంపతులు బోరున విలపించారు. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. రైతు ఆశీర్వాదమును ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.