Vallabhaneni Vamsi: రాష్ట్రవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించిన నియోజకవర్గం గన్నవరం. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గెలిచారు వల్లభనేని వంశీ. అక్కడకు కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు. వైసీపీలోకి వెళ్తే పర్వాలేదు కానీ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మించి మాట్లాడారు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై దారుణంగా వ్యాఖ్యానాలు చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి గన్నవరంలో కూడా పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టు వాయిదాలకు వచ్చిన మారువేషంలో వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే గత ఐదేళ్లుగా వంశీ నేతృత్వంలో ఆయన అనుచరులు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అయితే ఓడిపోయిన తర్వాత అజ్ఞాతంలోకి వంశీ వెళ్ళిపోయారు. కానీ నాటి పాపాలు ఆయన అనుచరులను వెంటాడుతున్నాయి. పాత కేసులను తిరగదోడుతూ పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. తాజాగా నలుగురు వంశీ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు.అయితే వల్లభనేని వంశీ చుట్టు ఉచ్చులో భాగంగానే వారి అరెస్టులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
* డిసెంబర్లో అరెస్ట్?
వల్లభనేని వంశీ అరెస్టు డిసెంబర్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆయన వైసీపీలోకి వెళ్లిపోవడానికి కారణం నకిలీ పట్టాలు. ఇప్పుడు అదే నకిలీ పట్టాల కేసు తెరపైకి వస్తోంది. దాంతోపాటు మట్టి తవ్వకాల్లో భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దానిపై సమగ్ర విచారణ చేస్తామని మంత్రి కోళ్లు రవీంద్ర ప్రకటించారు. వైసీపీలోకి ఫిరాయించిన తర్వాత వల్లభనేని వంశీ వికృత చేష్టలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆయనకు తప్పకుండా బుద్ధి చెప్పాలని టిడిపి క్యాడర్ బలంగా కోరుకుంటుంది. ఆయన అనుచరుల అరెస్టులు ప్రారంభం కావడంతో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో వంశీ చుట్టు పెద్ద ఉచ్చు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
* కొద్దిరోజులుగా అజ్ఞాతంలోనే
ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూసారు వల్లభనేని వంశీ మోహన్. వైసీపీ నుంచి టిడిపిలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. గన్నవరంలో తనను ఓడించిన మగాడు లేడని తరచూ సవాల్ చేసేవారు. ప్రజలు తిరస్కరించేసరికి కనిపించకుండా మానేశారు. అమెరికా వెళ్ళిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఇప్పటికే ఉన్న కేసుల విచారణకు ఆయన తరచూ గన్నవరం వస్తుంటారని కూడా తెలుస్తోంది. డిసెంబర్లో జరిగే విచారణకు వస్తే ఆయన అరెస్ట్ అవుతారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.