YSRCP MLCs: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ సస్పెండ్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఇప్పుడు గట్టిగానే సౌండ్ చేస్తున్నారు. వారి వాయిస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే ఉంది. అయితే అందులో ఒకరు సొంత పార్టీ పైనే తిరుగుబాటు చేస్తుండగా.. మరొకరు ఒక ఎమ్మెల్యేను నేరుగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. తాను కనుసైగ చేస్తే ఉండరని హెచ్చరిస్తున్నారు. ఆ ఇద్దరి ఎమ్మెల్సీలు వైసీపీలో లేరని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ వారిద్దరు మాత్రం పార్టీ వాయిస్ గానే వినిపిస్తున్నారు. ప్రత్యర్థులను హెచ్చరిస్తున్నారు. వారిద్దరి వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఎవరు వారు అంటే దువ్వాడ శ్రీనివాస్, అనంత్ బాబు. వీరిద్దరినీ వదులుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మనసు రావడంలేదని తెలుస్తోంది.
అనంతబాబు హెచ్చరికలు..
రంపచోడవరం ( Rampa Chodavaram )ప్రాంతంలో తనకంటూ హవా చాటుకుంటూ వచ్చారు అనంత్ బాబు. అక్కడ పేరుకి ఎమ్మెల్యే కానీ.. మొత్తం నడిపేది అనంత్ బాబు. అందుకే అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రోటోకాల్ లభించేలా చేశారు. అయితే వైసిపి హయాంలోనే సొంత కారు డ్రైవర్ను హత్య చేయించి డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. పార్టీ ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే అది ప్రకటన వరకు అన్నట్టుగా మారింది. తిరిగి ఆయన వైసీపీ నేతగానే చలామణి అవుతున్నారు. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మొన్నటి ఎన్నికల్లో ఓ సాధారణ అంగన్వాడీ కార్యకర్తగా ఉన్న శిరీషా దేవి గెలిచారు. ఇప్పుడు అనంతబాబు అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆయన నేరుగా ఎమ్మెల్యేకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తను కనుసైగ చేస్తే చాలు అంతా జరిగిపోతుంది అంటూ హెచ్చరిస్తుండడం పై ఎమ్మెల్యే శిరీష దేవి స్పందించారు. అంత సీన్ లేదంటూ ప్రతిస్పందించారు. ఒక మహిళా ఎమ్మెల్యేను.. అందునా అధికార పార్టీ ఎమ్మెల్యేను బెదిరించడం అంటే చిన్న విషయం కాదు. కానీ అనంత్ బాబు మాత్రం తన వెంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భావిస్తున్నట్టు కనిపిస్తున్నారు.
దువ్వాడది అదే వైఖరి..
ఇంకోవైపు దువ్వాడ శ్రీనివాస్( Srinivas) వ్యవహార శైలి కూడా అలానే ఉంది. ఆయనపై సైతం సస్పెన్షన్ వేటు పడింది. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల్లో పార్టీ చర్యలు తీసుకుంది. అయితే ఆయన ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సొంత పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ప్రత్యర్థి తో చేతులు కలిపి సొంతవారే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానల్ పెట్టి ఓడిస్తానని హెచ్చరిస్తున్నారు. అయితే ఈయన సైతం వైసీపీ నేతగానే తన వాయిస్ వినిపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ నాయకత్వాన్ని గౌరవిస్తూనే జిల్లా నాయకత్వాన్ని తప్పుపడుతున్నారు. అయితే వీరిపై చర్యలు తీసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. పార్టీ నుంచి వేటు వేసేందుకు వెనుకడుగు వేస్తోంది. పార్టీ నుంచి బహిష్కరణ అన్నమాట రావడం లేదు. వారు కూడా ఎన్నికలకు ముందు తమపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారన్న ఆలోచనతో ఉన్నారు. ఆ ధీమాతోనే అలా మాట్లాడగలుగుతున్నారు. మొత్తానికి అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన డిఫెన్స్ కనిపిస్తోంది.