Ration card vs land passbook: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీని దారుణంగా దెబ్బతీసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రజల ఆస్తికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను అప్పట్లో ప్రచురించారు. ఆపై పొలాల్లో వేసిన సర్వే రాళ్లపై కూడా జగన్ ఫోటో ముద్రించారు. అంతవరకు ఏ ప్రభుత్వము సాహసం చేయని విధంగా జగన్ ఈ చర్యలకు ఉపక్రమించారు. కానీ ప్రజలు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొన్నటి ఎన్నికల్లో గట్టి దెబ్బ చూపించారు. అయితే ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాని నుంచి గుణపాఠాలు నేర్వలేదు. ఇప్పటికీ వితండవాదం చేస్తూనే ఉంది. సీనియర్ నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు లాంటి వారు కూడా అది కేంద్ర ప్రభుత్వ పథకం అని చెబుతున్నారు. తమకు నష్టం చేసిందన్న దానిపై పోస్టుమార్టం చేసి దాని జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అలా చేయడం లేదు.
ఇప్పటికీ అదే వాదన..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా( Sakshi media) అనుకూలమో.. శాపమో చెప్పలేకపోతున్నాం. నిన్ననే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఒక డిబేట్ నిర్వహించారు. ఓ జర్నలిస్టుని పిలిచి చర్చించారు. అయితే ఆయన తన వెంట తెచ్చుకున్న 20 రూపాయల నోటును చూపించారు. దానిపై గాంధీజీ బొమ్మను చూపించి.. ఆ బొమ్మ ఉంటే గాంధీజీకి ఆ నోటు చెందిపోతుందా అని లాజిక్ లేని ప్రశ్న వేశారు. నగదు చలామణిని తీసుకువచ్చి.. ప్రజల ప్రైవేట్ ఆస్తితో ముడిపెట్టడం మాత్రం సాక్షి డిబేట్లకే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పని కరెక్ట్ అన్నట్టు సాక్షి మీడియాలో వాదన ఉంది. దానికి విశ్లేషకుల రూపంలో కొంతమంది కూడా వితండవాదం చేస్తున్నారు.
పిచ్చి లాజిక్కులతో
తాజాగా రేషన్ కార్డులు( ration card ) చూపించారు. రేషన్ కార్డుల పై చంద్రబాబు ఫోటో ఉండడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఫోటో ఉండడంతో రేషన్ కార్డులు ఆయన సొంతమవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డులో అనేవి ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించినవి. దశాబ్దాలుగా ఎవరు అధికారంలో ఉంటే వారి ఫోటోలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రజల వ్యక్తిగత ఆస్తుల పత్రాలకు.. ప్రభుత్వం మంజూరు చేసే రేషన్ కార్డుకు ముడిపెడుతూ చర్చకు తెర లేపుతున్నారు. 2024 ఎన్నికలతో జగన్మోహన్ రెడ్డి తప్పిదాన్ని ప్రజలు మరిచిపోతున్నారు. ఇప్పుడు దానిని మరోసారి గుర్తు చేసి ప్రజల్లో పలచనవుతున్నారు వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులు. అనుకూల మీడియా జర్నలిస్టులు, అనుకూల విశ్లేషకులు. ఇలానే ముందుకు సాగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి కష్టమే.