Uttarandhra Janasena: ఉత్తరాంధ్రలో జనసేన సీట్లు కన్ఫర్మ్ అయ్యాయా? టిడిపి క్లారిటీ ఇచ్చిందా? ఆ స్థానాలను విడిచి పెట్టేందుకు సిద్ధపడిందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. ఉత్తరాంధ్రలో 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో కొన్ని స్థానాలను జనసేనకు విడిచి పెట్టేందుకు టిడిపి సమ్మతించిందని టాక్ నడుస్తోంది. మూడు జిల్లాల్లో ప్రాతినిధ్యం ఉండేలా జనసేన భావిస్తున్నట్లు సమాచారం.
2009లో ప్రజారాజ్యం సీట్లతో పాటు గత ఎన్నికల్లో జనసేన దక్కించుకున్న ఓట్లను బట్టి ఉత్తరాంధ్రలో సీట్లు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.ఉమ్మడి విశాఖ జిల్లాలో గాజువాక, భీమునిపట్నం,పెందుర్తి,ఎలమంచిలి స్థానాలను జనసేనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గాజువాక నుంచి జనసేన పిఎసి సభ్యుడు కోన తాతారావు పోటీ చేయబోతున్నారని సమాచారం. 2019లో జనసేన తరఫున విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.బీసీ నేత కావడంతోఆయనకు జనసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
* భీమిలి నియోజకవర్గానికి సంబంధించి పంచకర్ల సందీప్ ఈసారి పోటీ చేసే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన సందీప్ కు ఏకంగా పాతికవేలు దాకా ఓట్లు వచ్చాయి.ఆ ప్రాతిపదికనే జనసేన ఈ స్థానాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
* పెందుర్తి టికెట్ సైతం జనసేన ఆశిస్తోంది. పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొద్ది రోజుల కిందట జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పవన్ టికెట్ కేటాయిస్తారని తెలుస్తోంది.
* ఎలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టిడిపి నుంచి జనసేన లో చేరి గత ఎన్నికల్లో పోటీ చేశారు. 18 వేల పైచిలుకు ఓట్లు సాధించారు.దీంతో ఈసారి ఆయనను బరిలో దించితే విజయం ఖాయమని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* విజయనగరం జిల్లాకు సంబంధించి నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని తెలుస్తోంది.ఇక్కడ కాపు సామాజిక వర్గం అధికం. టిడిపిలో బహుముఖ పోటీ ఉంది. దీంతో నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు విడిచి పెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ టిడిపి తరఫున మాజీ మంత్రి కళా వెంకట్రావు ఇన్చార్జి గా ఉన్నారు. ఆయనను విజయనగరం ఎంపీగా పోటీ చేయించి జనసేనకు ఈ స్థానాన్ని కేటాయించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. మొత్తానికైతే ఉత్తరాంధ్రలో జనసేనకు ఆరు సీట్లు కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆ రెండు పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు.