https://oktelugu.com/

AP – BJP : బీజేపీలో మార్పులు అనివార్యమా? ప్రచారమా?

ఇప్పుడు సోము వీర్రాజును తప్పిస్తే అదే సామాజికవర్గం నేతతో భర్తీ చేస్తారు తప్ప సత్యకుమార్ కు చాన్స్ లేదన్న వాదన వినిపిస్తోంది. కానీ దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : July 4, 2023 / 02:17 PM IST
    Follow us on

    AP – BJP :  హ్యాట్రిక్ విజయంపై ఫోకస్ పెంచిన మోదీ, షా ద్వయం అందుకు తగ్గట్టు కీలక నిర్ణయాలు దిశగా అడుగులేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీలో సమూల ప్రక్షాళనకు దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అన్ని రాష్ట్రాల్లో అవసరమైన చేర్పులు, మార్పులు చేయడానికి వ్యూహరచన చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. కేంద్ర కేబినెట్ లోని సీనియర్ మంత్రులను తొలగించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన వారికి కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
    ఇప్పటికే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ కీలక నేతలు చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన సైతం వస్తుందని టాక్ నడుస్తోంది. అయితే అది ఎంతవరకూ వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. కానీ  గత కొద్దిరోజులుగా మీడియాలో మాత్రం ఇదే ప్రధాన వార్తగా మారుతోంది. జాతీయ మీడియా నుంచి తెలుగు మీడియా వరకూ ప్రతీనోటా బీజేపీలో సంభవించే మార్పులపైనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నాయకత్వాల మార్పుపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల పదవీ కాలం ఎప్పుడో పూర్తయ్యింది. వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు కసరత్తు జరుగుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. కానీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం సైతం పూర్తయ్యింది. ఆ లెక్కన ఆయన మార్పు కూడా అనివార్యం కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
    ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇచ్చి.. బండి సంజయ్ ను కేబినెట్ లో తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎంతవరకూ నిజమన్నది తెలియడం లేదు. బండి సంజయ్ మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పదవి రెడ్లకు ఇచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన కిషన్ రెడ్డికి బీజేపీ పగ్గాలు ఇచ్చినా పెద్దగా వర్కవుట్ కాదన్నది ఒక వాదనగా ఉంది.
    ఏపీలో సైతం సోము వీర్రాజుకు పక్కకు తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన సత్యకుమార్ ను తీసుకుంటారని కథనం సారాంశం. బీజేపీ ఒక స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. దశాబ్దాలుగా రాజ్యాధికారం కోసం చూస్తున్న కాపులకు పెద్దపీట వేయాలన్నది వ్యూహం. అందులో భాగంగా కన్నా లక్ష్మీనారాయణకు, తరువాత సోము వీర్రాజుకు ఇచ్చారు. ఇప్పుడు సోము వీర్రాజును తప్పిస్తే అదే సామాజికవర్గం నేతతో భర్తీ చేస్తారు తప్ప సత్యకుమార్ కు చాన్స్ లేదన్న వాదన వినిపిస్తోంది. కానీ దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.