AP Elections 2024: ఇన్నాళ్లు అధికార పార్టీ సేవలో తరించిన ఆర్టీసీ.. ఇప్పుడు ఓటు వేసేందుకు వస్తున్న వలస ఓటర్లకు రవాణా సదుపాయం కల్పించడంలో మాత్రం విఫలమైంది. ఏపీ నుంచి అధికంగా వలసలు ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఎక్కువ మంది వలస కూలీలు ఉంటారు. కానీ వారంతా స్వగ్రామాలకు చేరుకునేందుకు ఆప సోపాలు పడాల్సి వస్తోంది. ఒక్క హైదరాబాదు నుంచి సుమారు 3 లక్షల మందికి పైగా ఏపీ ఓటర్లు రాష్ట్రానికి వచ్చినట్లు ఒక అంచనా. సోమవారం ఉదయం వరకు దాదాపు 8 నుంచి 10 లక్షల మంది రావచ్చని తెలుస్తోంది.
అయితే వలస ఓటర్ల కోసం ప్రత్యేక సర్వీసులు నడపడంలో ఏపీఎస్ఆర్టీసీ వెనుకబడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వలస ఓటర్లు విపక్ష కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు రావడంతోనే.. ఇలా చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. జగన్ సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులను సమకూర్చిన సంగతి తెలిసిందే. కానీ ఓటేసేందుకు సొంత గ్రామాలకు వచ్చే సామాన్య ప్రజలకు మాత్రం అవసరమైన బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైంది. హైదరాబాద్,చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని ఏపీకి చెందిన వారంతా ఓటు వేసేందుకు తప్పకుండా సొంతూళ్ళకు వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ డిజిపి ర్యాంక్ అధికారి అయిన ఆర్టీసీ ఎండి ద్వారకానాథ్ కు ఈ విషయం తెలియదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొద్దిరోజుల కిందట వరకు సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభకు వెయ్యి నుంచి 3000 చొప్పున బస్సులు కేటాయించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం ప్రజలకు సరైన ఏర్పాట్లు చేయడం లేదు.
హైదరాబాద్ నుంచి ఏపీలో అన్ని జిల్లాలకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 300 బస్సులను మాత్రమే వేశారు. శనివారం 205 బస్సులను నడిపారు.
అయితే ఏపీ ఓటర్ల కోసం తెలంగాణ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపడం విశేషం. టిఎస్ఆర్టిసి ఏపీకి 2000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 500 ప్రత్యేక బస్సులు, జేబీఎస్ బస్టాండ్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే 58 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.