Good news for Ayyappa devotees: కార్తీక మాసం ప్రారంభం అయింది. ఈనెల ఎక్కువగా పూజలు జరుగుతాయి. శివుడికి ప్రీతికరమైన నెల కూడా ఇదే. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది అయ్యప్ప దీక్షను స్వీకరిస్తారు. 41 రోజులపాటు దీక్షలో ఉండి శబరిమలై వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. దీక్షను విరమిస్తారు. అయితే దీక్ష విరమణ కోసం శబరిమలై వెళ్లే భక్తులు దారి పొడవునా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఇటువంటి సమయంలో రవాణా కీలకం. చాలామంది ముందస్తుగా ప్లాన్ చేసుకుంటారు. అటువంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ఆర్టీసీ. శబరిమల కు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ శబరిమలకు వెళ్లే విధంగా రూట్ ఖరారు చేసింది. ఇందుకోసం రోజుల లెక్కన ప్యాకేజీలను ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. ఈ ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్ల సౌకర్యం సైతం ప్రారంభించింది.
శబరిమలకు తొలిసారిగా..
సాధారణంగా కార్తీక మాసంలో పంచారామాలు, ప్రముఖశైవక్షేత్రాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఏటా భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతూ ఉంటుంది. అయితే ఈసారి శబరిమలైకు సైతం ఈ సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ముందుకు రావడం విశేషం. సాధారణంగా అయ్యప్ప భక్తులు ఐదు నుంచి వారం రోజులపాటు శబరిమల యాత్రకు సిద్ధపడుతుంటారు. అయితే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఈ మూడు ప్యాకేజీల్లోనే ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తేవడం విశేషం. ఐదు రోజుల యాత్రకు సంబంధించి విశాఖ నుంచి విజయవాడ, మేల్ మరువత్తూర్, ఎరుమేలి, పంబ వరకు ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది ఈ బస్సు. ఈ ఐదు రోజుల యాత్రలకు సంబంధించి టికెట్ ధర పెద్దలకు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రూ.6,600.. ఇంద్ర సర్వీసులకు రూ.8,500 గా నిర్ణయించారు.
– ఆరు రోజుల యాత్రలో టిక్కెట్ ధరలు పెద్దలకు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రూ.7,000, ఇంద్ర సర్వీసులకు రూ.9,000 గా నిర్ణయించారు.
– ఏడు రోజుల యాత్రలో విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పలని, ఎరుమేలి, పంబ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భాగంగా తమిళనాడులోని మధురై, రామేశ్వరం తో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖ చేరుతుంది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రూ.7600, ఇంద్ర సర్వీసులకు రూ.10,000 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించారు.
– ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ సర్వీసు సేవలను ప్రారంభించింది. భక్తులు నేరుగా ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. లేకుంటే దగ్గర్లోని బస్టాండ్ లో సైతం చేసుకునే అవకాశం ఉంది.