APSRTC Women Free Buses: ఆర్టీసీలో( APSRTC ) మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా విడుదల చేయనుంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పథకాన్ని సాఫీగా అమలు చేసేందుకు వీలుగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా బస్సుల్లో మార్పులు తీసుకొస్తోంది. మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకొని.. ఎక్కువమంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు ఉన్న సిట్టింగ్ విధానంలో సమూల మార్పులు తీసుకురానుంది. ఇప్పటివరకు బస్సుల్లో ఒకవైపు మూడు సీట్లు.. రెండో వైపు రెండు సీట్లు ఉంటాయి. దీంతో బస్సులు ఇరుకుగా ఉంటాయి. అయితే కేవలం కూర్చునే వారిని దృష్టిలో పెట్టుకొని అలా చేసేవారు. కానీ ఉచిత ప్రయాణం నేపథ్యంలో ప్రయాణికులు సంఖ్య ఎక్కువ ఎక్కువ కానున్న నేపథ్యంలో.. ఇకనుంచి మూడు సీట్లను తొలగించనున్నారు.. అటు రెండు ఇటు రెండు కొనసాగించనున్నారు.
Also Read: ‘స్త్రీ శక్తి’.. మహిళల కొత్త పథకం పై చంద్రబాబు కీలక ప్రకటన!
ఎక్కువమంది ప్రయాణించేలా..
సాధారణంగా ఈ పథకం ప్రారంభం అయిన తర్వాత కచ్చితంగా మహిళల రద్దీ పెరుగుతుంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువమంది ప్రయాణించేలా బస్సులను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా సీట్లను మార్చుతున్నారు. అలాగే మహిళల తాకిడి ఎక్కువగా ఉండే సమయాల్లో సర్వీసులను కూడా పెంచుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు మహిళలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆ సమయాల్లో సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. రద్దీ లేని రూట్లలో బస్సులను తొలగించి.. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో మళ్ళించనున్నారు.
నిరంతరాయంగా స్టూడెంట్స్ స్పెషల్ సర్వీసులు..
ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ విద్యార్థుల ( students) కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. అయితే ఇది కేవలం ఉదయం, సాయంత్రం పూట మాత్రమే నడిచేవి. ఇకనుంచి అలా కాకుండా నిరంతర సర్వీసుల రూపంలో నడపనున్నారు. తద్వారా మహిళలు కూడా ఆ బస్సుల్లో సర్దుబాటు కానున్నారు. ఇప్పటికే ఈ పథకం కర్ణాటక తో పాటు తెలంగాణలో అమలు చేస్తున్నారు. అయితే అక్కడ అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే అక్కడ అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఉచిత ప్రయాణానికి సంబంధించి సన్నాహాలు ప్రారంభించారు. అక్కడి లోపాలను గుర్తించి ఇక్కడ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: కానిస్టేబుల్ పోస్ట్ కు బీటెక్ గ్రాడ్యూయేట్ల క్యూ.. ఇలా ఉంది పరిస్థితి!
ఆదాయం కోసం ప్రత్యామ్నాయాలు..
ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి( free travelling) సంబంధించిన ఈ పథకంతో తలెత్తే లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయాలను గుర్తించే పనిలో పడింది ప్రభుత్వం. ముఖ్యంగా ఆర్టీసీలో కార్గో సేవలను మరింత విస్తృతం చేయనుంది. ఇప్పటికే ఆర్టీసీలో వస్తు రవాణా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఆదాయం సమకూరుతోంది. మరోవైపు టెంపుల్ టూరిజం పథకాలను సైతం విస్తృతం చేయాలని భావిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాల సందర్శనకు వీలుగా ఆర్టీసీ కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తేనున్నారు. వీటితోపాటు ఆర్టీసీ బస్టాండ్లలో ఖాళీ స్థలాలు లీజుకు ఇవ్వడం, లగ్జరీ, ఆల్ట్రా లగ్జరీ బస్సుల శాతాన్ని పెంచడం వంటి చర్యలు తీసుకున్నారు. వీటి ద్వారా ఉచిత ప్రయాణానికి సంబంధించి లోటును భర్తీ చేయనున్నారు.