Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. నిజంగా ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త. మరోవైపు విశాఖలో విమానాశ్రయం నావి పరిధిలో చేరనుంది. ఇకనుంచి విమాన ప్రయాణం చేయాలనుకునేవారు భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆశ్రయించక తప్పదు. విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే విశాఖ నుంచి విమాన ప్రయాణం చేయాలనుకునే వారి కోసం ప్రత్యేక రవాణా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు ఎలక్ట్రిక్ ఏసి బస్సులను ప్రవేశపెడుతున్నారు. దాదాపు 100 ఆధునిక ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు విశాఖ నగరానికి రానున్నాయి. ఇవి పూర్తిగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడనున్నాయి. కాలుష్య రహితంగా సేవలు అందించనున్నాయి.
* ఈరోజు నాలుగు బస్సులు..
విశాఖ నగరంలో ఆర్టీసీ డిపోలు చాలా వరకు ఉన్నాయి. అందులో కూర్మన్నపాలెం డిపోకు ఓ నాలుగు ఎలక్ట్రిక్ బస్సులు ఈరోజు చేరుకున్నాయి. ఈ బస్సులు భోగాపురం ఎయిర్పోర్ట్ కు రెండు వేరువేరు మార్గాల్లో సర్వీస్ లను అందించనున్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల ప్రయాణం చేసే వీలుంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కు రాకపోకలు సాగించే వారికి ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ప్రతి బస్సులోనూ 40 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సులను రూపొందించారు. ఆటోమేటెడ్ డోర్స్, ప్రత్యేక మైక్ సిస్టం, సీసీ కెమెరాలు సైతం అందుబాటులో ఉంటాయి. 100% భద్రత ఈ బస్సుల ప్రత్యేకత. పెద్దగా శబ్ద కాలుష్యం ఉండదు. ఇంజన్ శబ్దం కూడా పెద్దగా రాదు. ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులకు ఎలాంటి అలసట ఉండదు. గాజువాక నుంచి వెళ్లే మార్గంలో ఎన్ఏడి కూడలి, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతు వాక, మధురవాడ, ఆనందపురం, తగరపు వలసల మీదుగా ఈ బస్సులు భోగాపురం చేరుకుంటాయి. ఇక మరో మార్గంలో సింధియా, రైల్వే స్టేషన్, ద్వారక బస్ స్టేషన్, వుడా పార్క్, ఋషికొండ, ఐటీ హిల్స్, మారికవలస మీదుగా వెళ్తాయి. మొదటి దశలో 20 బస్సులు నడుస్తాయి. తరువాత 80 బస్సులు రానున్నాయి.
* చుట్టుపక్కల ప్రాంతాల నుంచి..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వీలైనన్ని ఎక్కువ బస్సు సర్వీసులు నడపాలని భావిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. కేవలం విశాఖ నగరం నుంచి మాత్రమే కాదు. అటు అనకాపల్లి, ఇటు విజయనగరం, ఇంకో వైపు శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో కూడా ఆర్టీసీ ఏసీ బస్సులు నడవనున్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్ కు. మరోవైపు విశాఖ నగరంలో విమాన ప్రయాణికుల కోసం వెయిటింగ్ లాంజ్ లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని జిఎంఆర్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ బస్సుల చార్జీల వివరాలు త్వరలో ప్రకటించనుంది ఆర్టిసి. అయితే ఈ బస్సులను నడిపేది ప్రైవేటు డ్రైవర్స్ కాగా.. టికెట్స్ మాత్రం ఆర్టీసీ కండక్టర్లు జారీ చేస్తారు.
