AP Road Development Districts: అమరావతి రాజధాని( Amaravathi capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి రాగానే అమరావతి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తొలి ఏడాది నిధులు సమీకరించగలిగింది. ఈ ఏడాది జూన్ లో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2028 నాటికి అమరావతిని ఒక కొలిక్కి తేవాలని చంద్రబాబు ప్రత్యేక ఆలోచనతో ఉన్నారు. గత అనుభవాల దృష్ట్యా అమరావతిని ఎవరు అడ్డుకోకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. మరోవైపు అమరావతికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కనెక్టివిటీ పెంచేందుకు రోడ్డు కం రైలు ప్రాజెక్టులను సైతం కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. అందులో భాగంగా రాయలసీమలోని ఐదు జిల్లాల ప్రజలకు అమరావతికి మార్గం సుగమం చేసేందుకు ప్రతిష్టాత్మక హైవే ప్రాజెక్టు చేపట్టాలని తాజాగా నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. అనంతపురం- గుంటూరు జాతీయ రహదారి 544డిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఇందుకు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అనంతపురం( Ananthapuram ) జిల్లాలోని బుగ్గ నుంచి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వరకు… వినుకొండ నుంచి గుంటూరు వరకు రహదారి విస్తరణ జరగనుంది. దీనికి కేంద్రం రూ.4200 కోట్లు ఖర్చు చేయనుంది. మొదటి ప్యాకేజీలో భాగంగా బుగ్గ నుంచి గిద్దలూరు వరకు 135 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేస్తారు. అనంతపురం జిల్లాలో 100 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. రెండో ప్యాకేజీలో వినుకొండ నుంచి గుంటూరు వరకు 84.80 కిలోమీటర్ల రహదారిని విస్తరిస్తారు. నంద్యాల జిల్లాలో కొలిమిగుంట్ల మండలం, ఆవుకు మండలం, బనగానపల్లి మండలం, గోస్పాడు మండలం, మహానంది మండలాల్లో బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. బనగానపల్లి, కైప, అప్పలాపురం, టంగుటూరు, అంకిరెడ్డి పల్లె, రాఘవ రాజు పల్లి, కనకాద్రి పల్లి, కొలిమిగుండ్ల, రామాపురం అవుకు, రాయపాడు, పసురపాడు, ఎస్ నాగులవరం, దీబగుంట్ల, గాజుల పల్లెలో బైపాస్ లు రాబోతున్నాయి.
ఈ హైవే విస్తరణతో రాయలసీమ ప్రజలు అమరావతికి త్వరగా చేరుకోవచ్చు. ఈ రహదారితో శ్రీ సత్య సాయి, అనంతపురం, కడప, నంద్యాల, కర్నూలు జిల్లా ప్రజలకు కనెక్టివిటీ మరింత పెరగనుంది.