AP Rain Alert: ఏపీలో( Andhra Pradesh) వర్షాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితమే వాయుగుండం ప్రమాదం తప్పింది. ఇంతలోనే మరో వార్త చేరింది. మంగళవారం నాటికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు విపత్తులతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. అయితే రెండు రోజుల కిందట ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య వాయుగుండం దాటింది. అది బలహీనపడడంతో వర్ష తీవ్రత తగ్గింది. దీంతో సాధారణ పరిస్థితి నెలకొంది. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో వర్షం నమోదవుతూ వస్తోంది.
రేపటికి అల్పపీడనం..
బంగాళాఖాతంలో( Bay of Bengal ) మంగళవారం నాటికి ఆవర్తనం ఏర్పడనుంది. అల్పపీడనంగా మారేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఒకవేళ వాయుగుండం గా మారి తీరం వైపు దూసుకొస్తే మాత్రం ఏపీకి పెను ప్రమాదమే. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి ఏపీలో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదు అవుతాయి. అల్పపీడనం కదలికబట్టి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. ఆకాశం మేఘావృత్తంగా మారి.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వర్షం పడే సమయంలో ఉరుములు, పిడుగులు పడుతుండడంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో గత కొద్ది రోజులుగా పిడుగులతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. కానీ పిడుగుపాటుకు సంబంధించి మృత్యువాతలు ఆగడం లేదు.
అరేబియా సముద్రం నుంచి..
ఇంకోవైపు మహారాష్ట్ర( Maharashtra) సమీపంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపి అరేబియా మహాసముద్రం వైపు వస్తోంది. అది వాయుగుండం గా మారితే తెలంగాణతో పాటు ఏపీ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో వర్షం కుంభవృష్టిగా పడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో వాతావరణ శాఖ నుంచి భారీ హెచ్చరిక వచ్చింది. అయితే అరేబియా మహాసముద్రం లో ఏర్పడిన అల్పపీడనం.. తీరం వైపు వస్తే తెలంగాణకు భారీ వర్షం తప్పదు. రాయలసీమకు సైతం ప్రభావం ఉంటుంది. అయితే ఎప్పుడూ లేనంతగా రాయలసీమలో ఈసారి అధికంగా వర్షం నమోదయింది. ఒకవైపు బంగాళాఖాతం నుంచి.. మరోవైపు అరేబియా మహాసముద్రం నుంచి తీవ్ర హెచ్చరికలు రావడంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. మరోవైపు రుతుపవనాలు నిష్క్రమించాయి. కానీ వెళ్తూ వెళ్తూ విపత్తులు ఏర్పడేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి.