Tesla: ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది రాజకీయ పార్టీల పరిస్థితి. ఎన్నికల్లో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. దానిని రాజకీయం చేసి ఓట్లు దండుకోవాలని ప్రయత్నంలో పార్టీలు ఉండడం విచారకరం.ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ ఇండియాలో ఓ ప్లాంట్ పెట్టాలని గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు ఇప్పుడు ముమ్మరం చేసిందని.. త్వరలోనే సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో ఓ బృందం ఇండియాకు వస్తుందని.. ఆ సంస్థ ఏపీలో పెట్టేందుకు ఆసక్తి చూపుతోందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే అది మా పుణ్యమే అంటూ అటు వైసిపి, ఇటు టిడిపి ప్రచారం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి. అయితే పరిశీలన కోసం ఏపీకి రావడం కూడా నిజమో కాదో తెలియదు. ఈలోపే టెస్లా ఏపీకి వచ్చేసినట్లుగా ఆ రెండు పార్టీలు క్రెడిట్ కు ఆరాటపడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాలేదన్న విమర్శ ఉంది. ఉన్న పరిశ్రమలను సైతం తరిమేశారన్న ఆరోపణ బలంగా వినిపించింది. పారిశ్రామిక ప్రగతి నిలిచిపోయిందని విపక్షాలు సైతం ముప్పేట దాడి చేశాయి. ఈ తరుణంలో ఎన్నికల్లో ఇది ప్రభావితం చేస్తుందని వైసీపీ నేతలు భయపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి తరుణంలో టెస్లా కంపెనీ ఇండియా వస్తుందని తెలిసి వైసీపీ నేతలు సరికొత్త ప్రచారానికి తెర తీశారు. ఆ కంపెనీ స్థాపనకు ఏపీలో అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ.. ఈ రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలని ప్రభుత్వం తరఫున ఆ సంస్థకు ఆహ్వానం పంపినట్లు సీఎం జగన్ ఫోటో పెట్టి మరి పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తరఫున ఒక ఇన్విటేషన్ పంపించినంత మాత్రాన ఏ కంపెనీ వచ్చి పెట్టుబడులు పెట్టడదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆ సంస్థకు అనువైన ప్రాంతం, రాయితీలు వస్తాయనుకుంటే వచ్చి ప్లాంట్ పెడతారు. లేకుంటే ప్రభుత్వం తరుపున ప్రతిపాదన వెళ్తేనే వారు సానుకూలంగా స్పందిస్తారు. కానీ ఇవేవీ జరగకుండానే టెస్లా ప్లాంట్ పెడుతుందని వైసీపీ ప్రచారం చేసుకోవడం గమనార్హం.
అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సైతం అలర్ట్ అయ్యింది. 2017లో చంద్రబాబు టెస్లా అధినేతను కలిశారు. నాటి ఫోటోను షేర్ చేసి.. అప్పట్లోనే ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు చర్చలు జరిపారని.. త్వరలోనే తమ ప్రభుత్వం రాగానే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు పనులు మొదలవుతాయని పోస్ట్ చేశారు. టెస్లా ఒకవేళ ఏపీకి వచ్చినా అది వైసీపీ ఘనత కాదు.. క్రెడిట్ తమది అని చెప్పే ప్రయత్నం టిడిపి చేస్తోంది. అయితే అసలు ప్లాంట్ పరిశీలనకు అనువైన ప్రాంతమే లేదు.. కనీసం ఆ బృందమే రాలేదు.. కానీ లేనిపోని ప్రచారం చేస్తుండడం పై సామాన్య జనాలు మండిపడుతున్నారు.