Pawankalyan – AP Volunteers : ఏపీలో ఏ ఒక్కరూ వైసీపీ నుంచి తప్పించుకునే చాన్సే లేదు. నేను, నువ్వు అన్న తేడా లేకుండా అందరి జాతకాలను ఆ పార్టీ తన వద్ద పెట్టుకుంది. తోక జాడిస్తే వాటిని బయటపెడుతోంది. అందుకే ఆ పార్టీ నుంచి తరచూ వైనాట్ 175 అన్న స్లోగన్ వినిపిస్తోంది. ఇంట్లో పుట్టిన పిల్లాడి నుంచి పెన్షన్ తీసుకునే వృద్ధుడి వరకూ ప్రతిఒక్కరి సమాచారం వైసీపీ వద్ద ఉంది. ప్రతిఒక్కరి వ్యక్తిగత వివరాలు, కేసులు, అలవాట్లు, ఏ పార్టీ అభిమాని, ఆదాయం, కులం, మతం, వివాహేతర సంబంధాలు..ఇలా ప్రతి సమాచారం వైసీపీకి చెందిన కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంది. వలంటీర్లు సేకరించి అందించే డేటా వైసీపీ నేతకు ఎఫ్.వో.ఏ అనే ఏజెన్నీ చేతిలోకి వెళుతుంది.
పవన్ వలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు కొనసాగిస్తున్నారు. వలంటీర్లు సేకరిస్తున్న డేటా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఎందుకు దాస్తున్నట్టు అని తాజాగా ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎఫ్.వో.ఏ అంటే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ. దీనికి యజమాని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో ఏజెన్సీని ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్ల నెట్ వర్క్ ను ఈ ఏజెన్సీ కమ్యూనికేట్ చేస్తుంది. అంటే డేటా డిటైలింగ్ బాధ్యత అన్న మాట.
వాస్తవానికి వలంటీరు ఎక్కువగా డేటా సేకరణలోనే నిమగ్నమవుతున్నారు. ప్రతి రెండు మూడు నెలలకు ఏదో ఒక సర్వే పేరిట ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పింఛన్ల పంపిణీ తరువాత వీరికి పని అంటూ ఏదీ లేదు. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ నుంచి వచ్చే ఆదేశాలు అమలుచేయడమే వలంటీర్ల ప్రధాన విధి. సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా వలంటీర్లు పనిచేస్తున్నా.. అనధికార బాస్ మాత్రం ఆ ఏజెన్సీయే. కానీ ప్రజల వ్యక్తిగత సమాచారం ఆ ఏజెన్సీకి వెళుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
అప్పుడెప్పుడో జనాభా లెక్కల సమయంలో అడిగేవారు. కానీ ఇప్పుడు అయినదానికి, కానిదానికి అన్నింటికీ డేటా అడుగుతున్నారు. చివరకు వివాహేతర సంబంధాల వివరాలు, మద్యం అలవాట్లను సైతం సేకరించి ఏజెన్సీకి పంపిస్తున్నారు. ఆ వివరాలతో బ్లాక్ మెయిల్ తరహాలో కుట్రకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల డేటా చోరీకి గురైందని నానా యాగీ చేశారు. ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టు వలంటీర్ల ముసుగులో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారన్న మాట.