AP on red alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండం గా మారనుంది. రాబోయే 12 గంటల్లోగా ఇది విశ్వరూపం చూపించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. పలు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని స్పష్టం చేసింది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక మధ్య అల్పపీడనం కొనసాగుతోంది. తదుపరి 12 గంటల్లో మరింత బలపడి వాయుకుండగా మారే అవకాశం ఉంది.
కుండ పోత వానలు..
వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోం శాఖ మంత్రి అనిత ఈరోజు సమీక్ష నిర్వహించారు. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. అవసరం అనుకుంటే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్ టి ఆర్ ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
– ప్రధానంగా ప్రకాశం, వైయస్సార్ కడప, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది.
– కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
– ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.
– ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కీలక సూచనలు చేశారు. పోలీస్ శాఖ పరంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నదులు వాగులు వంకలు, చెరువుల వద్ద ప్రమాద సూచన ప్రాంతాల్లో టికెట్లు ఏర్పాటు చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు.
– మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్ 112, 1070, 18004250101 లకు సంప్రదించాలని సూచిస్తోంది.