TDP MPs in Parliament: చట్టసభల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించడం ప్రజాప్రతినిధుల విధి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అసెంబ్లీ సమావేశాలను( assembly sessions ) బహిష్కరిస్తూ విపక్షాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో పాలకపక్షాలే ప్రతిపక్షాలుగా మారి చర్చలు చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు వాణి బలంగా వినిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో తెలుగు ఎంపీలు సమస్యలను సంధిస్తున్నారు. తమ గళం వినిపిస్తున్నారు. గత ఏడాది కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ ఎంపీలు మొత్తం 1576 ప్రశ్నలు లేవనెత్తారు. అందులో అత్యధికంగా టిడిపి ఎంపీలు 1081 ప్రశ్నలను లేవనెత్తగా.. ఆ తరువాత స్థానం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 267 ప్రశ్నలతో ఆ పార్టీకి చెందిన ఎంపీలు నిలిచారు. పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది
ప్రశ్నలు అడగడంలో..
ఏపీలో తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) 16 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. బిజెపికి ఇద్దరు, జనసేనకు ఒకరు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఉన్నారు. ఇక రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఇద్దరు, బిజెపికి ఇద్దరు, జనసేనకు ఒకరు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఉన్నారు. గత ఏడాది కాలంలో ఏపీకి చెందిన ఎంపీలు సగటున 71.6 ప్రశ్నలను లేవనెత్తారు. జాతీయ సగటు కంటే ఈ మొత్తం ఎక్కువ కావడం విశేషం. ఈ విషయంలో జాతీయ సగటు 46.8 గా ఉంది. ప్రశ్నల సగటు పరంగా కూడా టిడిపి ముందంజలో ఉంది. టిడిపి ఎంపీలు 77.2 శాతం ప్రశ్నలు అడిగితే.. బిజెపి ఎంపీలు 67.0, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 66.8, జనసేన 47.0 ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు ఏపీ ఎంపీలు 20017 పార్లమెంట్ చర్చల్లో పాల్గొన్నారు. టిడిపికి చెందిన 14 మంది ఎంపీలు 125 డిబేట్లో పాల్గొన్నారు. వైసిపి నలుగురు ఎంపీలు 42 డిబేట్లో, బిజెపికి చెందిన ఇద్దరు ఎంపీలు 22 డిబేట్ లలో పాల్గొన్నారని సదరు ఇంపాక్ట్ సంస్థ నివేదికలో తెలిపింది.
టిడిపి ఎంపీలు ముందంజ..
మరోవైపు హాజరు శాతంలో సైతం ఏపీ ఎంపీలు( member of parliament) ఉత్తమ పనితీరు కనబరిచారు. సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఒక పాయింట్.. పాల్గొన్న ప్రతి డిబేట్ కు మూడు పాయింట్లు, హాజరుకు 0.5 పాయింట్లు కేటాయించారు. ఈ లెక్కన టిడిపి పార్లమెంటరీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అగ్రస్థానంలో నిలిచారు. వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి రెండో స్థానంలో ఉండగా.. జనసేన ఎంపీ బాలసౌరీ మూడవ స్థానంలో నిలిచారు. జిఎం హరీష్ బాలయోగి, కలిశెట్టి అప్పలనాయుడు, కృష్ణ ప్రసాద్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. అత్యధిక ప్రశ్నలు లేవనెత్తిన ఎంపీగా విజయనగరం టిడిపి ఎంపీ అప్పలనాయుడు తొలి స్థానంలో ఉన్నారు. ఆయన ఒక్కరే పార్లమెంట్ సమావేశాల్లో 89 ప్రశ్నలను అడిగారు. ఆ తర్వాతి స్థానంలో 84 ప్రశ్నలతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిలిచారు. వైయస్ అవినాష్ రెడ్డి 80 ప్రశ్నలు అడిగినట్లు పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ నివేదికలో స్పష్టం చేసింది. మొత్తానికైతే చట్టసభల్లో మన ఎంపీలు గట్టిగానే తమ ముద్ర చాటుకున్నారు.