Free Bus Scheme In AP: సంక్రాంతికి సొంత గ్రామాలకు ప్రయాణం తో పాటు తిరుగు ప్రయాణం అయ్యే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక బస్సులతో పాటు సాధారణ బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించనుంది. మరోవైపు ఆర్టీసీ చార్జీల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు పెంచమని స్పష్టం చేసింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని చెప్పుకొచ్చారు. మహిళల ఉచిత ప్రయాణ పథకంలో సైతం ఎటువంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పారు. పండగ ప్రత్యేక సర్వీసులు సైతం ఉచిత ప్రయాణ పథకం కొనసాగుతుందని చెప్పారు.
* అనుమానాలకు తెరదించుతూ..
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ పండుగ స్పెషల్ బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుందా లేదా అనే అనుమానం ఉండేది. అందుకే దీనిపై క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సంక్రాంతి సందర్భంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అస్సలు బస్ చార్జీలు పెంచమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం సంక్రాంతికి సంబంధించి ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ఈ రద్దీ ప్రభావం పడకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల దోపిడీపై కూడా దృష్టి పెట్టింది ప్రభుత్వం. దాదాపు అన్ని జిల్లాల్లో అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలు పెంచితే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
* అదనపు రైళ్లు ఏర్పాటు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో రద్దీ నెలకొంది. జన అవసరాల దృష్ట్యా సాధారణ పల్లె వెలుగులను సైతం ఎక్స్ప్రెస్లుగా మార్చారు. ప్రధాన పట్టణాల మధ్య నడుపుతున్నారు. అంతర్ జిల్లా సర్వీసులను సైతం నడుపుతుండడంతో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు సంక్రాంతి రద్దీ నేపథ్యంలో విశాఖ, విజయవాడ మధ్య 12 ప్రత్యేక జన సాధారణ్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఎటువంటి రిజర్వేషన్లు అవసరం లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేసింది. దీంతో కొంతవరకు ప్రయాణాలకు సంబంధించి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.