AP Liquor policy : ఎన్నాళ్లకెన్నాళ్లకు… ఏపీలో మందుబాబుల కష్టాలు తీరాయి.. ఇక పండుగే!

రాష్ట్రంలో నాణ్యమైన మందు దొరికే ఐదు సంవత్సరాలు అవుతోంది. చంద్రబాబు సర్కార్ హయాంలో బ్రాండెడ్ మద్యం అందేది. కానీ జగన్ సర్కార్ మద్యం పాలసీని మార్చి.. నాసిరకం మద్యాన్ని విక్రయించింది. పాత బ్రాండెడ్ మద్యం అందిస్తామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు.

Written By: NARESH, Updated On : August 6, 2024 11:28 am

AP Liquer policy

Follow us on

AP Liquor policy : ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. ఇక బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఐదు సంవత్సరాల కిందట ఉన్న బ్రాండ్లు సరసమైన ధరలకు దొరకనున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించనుంది. వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన మద్యం విధానం సెప్టెంబర్ 31 తో ముగియనుంది. దీంతో నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టాలని చంద్రబాబు సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అనంతరం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.నూతన మద్యం పాలసీని ప్రకటించింది. అప్పటివరకు ఉన్న ప్రైవేటు మద్యం షాపులను రద్దు చేసింది.ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడపాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి షాపులను నిర్వహించింది. అయితే గతంలో మాదిరిగా బ్రాండ్ మద్యం అమ్మకాలు లేకుండా చేసింది.దేశంలో ఎక్కడా లేని, వినని బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. కమీషన్లకు కక్కుర్తి పడే జే బ్రాండ్ మద్యం అంటూ ప్రతిపక్షాలు విమర్శించడం ప్రారంభించాయి.అయినా సరే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అదే తరహా మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అయితే మద్యం పాలసీ అభాసు పాలయ్యింది. దీంతో ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగింది.అప్పట్లో విపక్షాలు మద్యం విధానం పైనే విమర్శలు చేశాయి. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అందుకే తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు మద్యం పాలసీని మార్చి బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించడం విశేషం.

* అటకెక్కిన నిషేధం
తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో నవరత్నాల్లో మద్య నిషేధాన్ని కూడా చేర్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించేందుకు నిర్ణయించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మద్యం షాపుల నిర్వహణ అవసరమని చెప్పుకొచ్చారు.ప్రతి సంవత్సరం 25 శాతం షాపులను తగ్గించి..ఎన్నికల నాటికి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. కానీ షాపులను తగ్గించకపోగా రకరకాల పేరుతో బార్లను ఏర్పాటు చేశారు. సంపూర్ణ మద్య నిషేధాన్ని అటకెక్కించారు.

* నాసిరకం మద్యం
చంద్రబాబు హయాంలో బ్రాండెడ్ మద్యం అందుబాటు ధరల్లో ఉండేది. దేశవ్యాప్తంగా చలామణిలో ఉండే మద్యం దొరికేది.కానీ జగన్ హయాంలో నాసిరకం మద్యం పంపిణీ ప్రారంభం అయింది. గతంలో ఎన్నడూ చూడలేని మద్యం సీసాలు కనిపించడం ప్రారంభించాయి. ధర కూడా అమాంతం పెరిగింది. ధర పెంచితే మద్యం తాగడం మానేస్తారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ ఈ నాసిరకం మద్యంతో ప్రజారోగ్యానికి తీవ్ర భంగం వాటిల్లిందని.. వేలాదిమంది మృత్యువాత పడ్డారని విపక్షాలు ఆరోపించాయి. అయినా సరే జగన్ సర్కార్ పట్టించుకోలేదు. చివరి వరకు నాసిరకం మద్యం చలామణి అయ్యింది.

* చంద్రబాబు హామీతో ఖుషి
అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే.. చంద్రబాబు నూతన మద్యం పాలసీని ప్రకటించినట్టు చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న పేరు పోసిన బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. అయితే ధరల విషయంలో మాత్రం ప్రకటన చేయలేదు. కొత్త మద్యం పాలసీ పై అధ్యయనం ప్రారంభించారు. ఇందుకుగాను 4 అధికారుల బృందాలను నియమించారు. వారు వివిధ రాష్ట్రాల్లో మద్యం పాలసీపై అధ్యయనం చేయనున్నారు. అందుకు తగ్గట్టుగామద్యం పాలసీని ప్రకటించనున్నారు. పాత బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయని తెలియడంతో మందుబాబులు ఆనందపడుతున్నారు.