AP Largest Cricket Ground: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. అన్ని రంగాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా క్రీడాభివృద్ధిపై దృష్టి పెట్టింది. రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి స్థల పరిశీలన కూడా పూర్తయింది. పెదలంక, చిన్న లంకలో స్థలాలను పరిశీలించింది. దేశంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ సహకారం అందించనుంది. దాదాపు 1.25 లక్షల మంది కూర్చుని మ్యాచ్ వీక్షించేలా స్టేడియం నిర్మాణం చేపట్టనుంది. ఇందుకుగాను రెండు వేల ఎకరాల భూమి అవసరం అని భావిస్తున్నారు. నెల రోజుల్లో నివేదికను తెప్పించే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరో నాలుగు సంవత్సరాల్లో ఈ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read: ఆమె విషయంలో తోక ముడిచిన వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా
* అంతర్జాతీయ స్థాయిలో..
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు( international cricket matchs) నిర్వహణకు అనుగుణంగా స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు బీసీసీఐ సహకారం అందించనుంది. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్ లకు అనుకూలంగా లేదని అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని సాంకేతిక కారణాలవల్ల అక్కడ మ్యాచులు నిర్వహించడం కష్టంగా మారింది. అందుకే స్పోర్ట్స్ సిటీ లో కొత్త స్టేడియం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం తరహాలో అతిపెద్ద స్టేడియం ఉండాలని ఆలోచన చేస్తోంది. దాదాపు లక్ష 25 వేల మంది కూర్చునే సామర్థ్యంతో ఈ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
* 100 ఎకరాల స్థలంలో
సుమారు 100 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం( cricket stadium) నిర్మాణానికి సంబంధించి.. నిర్మాణాలు జరపనున్నారు. అక్కడ పార్కింగ్ వంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చులు 60 శాతాన్ని బీసీసీఐ భరించనుంది. మిగిలిన 40 శాతాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ నెలాఖరు నుంచి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దానికి అనుసంధానంగా ఈ స్టేడియం నిర్మాణ పనులు కూడా ప్రారంభించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
* మంత్రి నారా లోకేష్ చొరవ
ఇక్కడ అంతర్జాతీయ స్టేడియం( International Stadium) అందుబాటులోకి వస్తే ఏటా కనీసం 10 అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ స్టేడియం విషయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా జై షా ఉన్నారు. ఈయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు. ఇటీవల తరచూ నారా లోకేష్ జై షాను కలుస్తున్నారు. మంగళగిరిలో అంతర్జాతీయ స్టేడియం అందుబాటులోకి వస్తే మ్యాచులు నిర్వహించే వీలుగా షెడ్యూల్ కేటాయిస్తామని కూడా జై షా హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.