AP Income & Debts : ఏపీలో ఆదాయం, అప్పు దారి మళ్లుతోందా?

ఏడాదికేడాది లబ్ధిదారుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఖజానాకు వివిధ రూపాల్లో చేరుతున్న వేల కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నట్టు అనుమానాలు వినిపిస్తున్నాయి. దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. 

Written By: Dharma, Updated On : May 24, 2023 5:35 pm
Follow us on

AP Income & Debts : ఆదాయం కనిపించడం లేదు.. చేస్తున్నఅప్పులకు లెక్కా పత్రం లేదు. సంక్షేమం మాటున రాష్ట్రంలో లూటీ జరుగుతోందా? ఇప్పుడిదే ఏపీలో సగటు మనిషికి ఎదురవుతున్న ప్రశ్న. బటన్ నొక్కి లక్షల కోట్లు పంచామని చెబుతున్న జగన్ సర్కారు అందుకు లెక్కలు చెప్పడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. పోలవరానికి అతీగతీ లేదు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. కొత్త ఉద్యోగాల ఊసు లేదు. ఉన్న ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వేతనాలు లేవు. మరి రాష్ట్ర ఆదాయం ఎటుపోతున్నట్టు? వరదలా వస్తున్న అప్పుల నగదు ఎటు వెళుతున్నట్టు? ఇన్ని ప్రశ్నలకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వం అది తన పని కాదన్నట్టు వ్యవహరిస్తోంది.

ఏపీ విషయంలో కేంద్ర పెద్దల ఉదాసీన వైఖరి తెలిసిందే. రాజకీయాల ప్రభావమో.. లేకుంటే విశాల భారతదేశ ప్రయోజనాలో తెలియదు కానీ ఏపీ విషయంలో మాత్రం కేంద్ర పెద్దలు కాస్తా కఠువుగానే వ్యవహరిస్తూ వచ్చారు. చంద్రబాబు హయాంలో ఇటువంటి కఠినత్వం అధికంగా కనిపించేది. అమరావతికి రూ.1000 కోట్లు అడిగితే కొర్రీలు పెట్టారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్క తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఉదాసీనంగా నిధులిస్తున్నారు. అప్పులకు అనుమతిస్తున్నారు. ఇకపై ఏ నిధులు అడగబోమని వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూప10 వేల కోట్లు తాజాగా తెచ్చుకున్నారు.

ఏ నెలకు ఆ నెల అప్పులు తెస్తూ నిధులను తోడేస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై.. గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే కేంద్రం నుంచి రూ. 25 వేల కోట్లు అప్పులు, ఇతర రూపంలో వచ్చాయి. పోలవరం నిధులు సహా మరే ఇతర ప్రాజెక్టులకు నిధులు అడగబోమని రాసిచ్చి తాజాగా  రూ.10 వేల కోట్ల ప్రత్యేక సాయం తెచ్చుకున్నారు. ఇక అప్పుల పరిమితిలో ఇప్పటికే పదమూడు వేల కోట్లకుపైగా వాడుకున్నారు. ఇలా నిధుల వరద పారుతూనే ఉంది. కానీ ఒక్క శాశ్వత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారంటే అదీ లేదు.

పోనీ అభివృద్ధి పనులు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించి  పెండింగ్ బిల్లులు ఎవరికైనా చెల్లిస్తున్నారా అంటే.. అదీ లేదు. పోనీ అభివృద్ధి పనులు చేస్తున్నారా అంటే అదీ లేదు. డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియదు. సంక్షేమ పథకాల్లో అతి భారీగా ఖర్చయ్యే రెండే రెండు పథకాలు రైతు భరోసా, అమ్మఒడి. ఈ రెండు పథకాలకూ అడ్డగోలు షరతులు పెట్టి లబ్దిదారుల్ని తగ్గించేస్తున్నారు. ఇతర సంక్షేమ పథకాలదీ అదే తీరు. ఏడాదికేడాది లబ్ధిదారుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఖజానాకు వివిధ రూపాల్లో చేరుతున్న వేల కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నట్టు అనుమానాలు వినిపిస్తున్నాయి. దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.