AP Housing Good News 2025: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం( AP government ) ప్రయత్నం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు లేని పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ పథకానికి దరఖాస్తు చేసేందుకు గడువు ఒకరోజు మాత్రమే ఉంది. గత కొద్దిరోజులుగా ఈ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నాలుగు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది. ఇల్లు లేని నిరుపేదలు.. గతంలో ఏ లబ్ది పొందని వారికి మాత్రమే పెద్ద పీట వేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ పథకం అమలు చేసి పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
ప్రత్యేక యాప్ ద్వారా..
గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ పథకం అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆవాస్ +( Aawas Plus ) అనే ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా అర్హులను గుర్తించడం, వారి వివరాలను సేకరించడం, ఇంటి స్థలం ధ్రువీకరణ వంటి ప్రక్రియలు డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నాయి. గ్రామ/ వార్డు సచివాలయాలకు చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ శాఖ ఏఈలకు ఇంటింటికి వెళ్లి అర్హులను గుర్తించే బాధ్యత అప్పగించారు. రేపే చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
– దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థి ప్రస్తుతం ఉండే ఇంటి ఫోటోలు, భవిష్యత్తులో ఇల్లు నిర్మించబోయే స్థలం చిత్రాలు యాప్ లో అప్లోడ్ చేయాలి. యాప్ ద్వారా తీసే ముఖచిత్రం ఆధారంగా ఆధార్ వివరాలు ఆటోమేటిక్ గా కనిపిస్తాయి. తరువాత జాబ్ కార్డు సమాచారాన్ని నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం రియల్ టైం ట్రాకింగ్ లో ఉండడంతో దరఖాస్తుల నిజా నిజాలు నిర్ధారించడం సులభతరం అవుతుంది.
– గతంలో పీఎం ఆవాస్ యోజన అనేది పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అమలు చేసేవారు. ఇప్పుడు గ్రామాలకు సైతం వర్తింపజేశారు.
– పేదల కోసం ఇల్లు మంజూరు విధానంలో రెండు విధానాలను అమలు చేయనున్నారు. సొంత స్థలం ఉన్నవారికి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. స్థలం లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మించనున్నారు. ఈ రెండు వర్గాలకు గాను అధికారులు వేర్వేరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
– కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎంపిక ప్రక్రియలో అత్యంత పేదలను ముందుగా అర్హులుగా గుర్తించి ఎంపిక చేస్తారు. అందులో భాగంగానే ఈ ప్రత్యేక యాప్ ను డిజైన్ చేశారు.
– రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదు అయిన వివరాలను కేంద్రానికి పంపితే.. అక్కడ మరోసారి పరిశీలించి తుది అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.