AP DSC 2026 Notification: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. డీఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పిన సంగతి తెలిసిందే. జనవరి నెల ముగిసేందుకు మరో పది రోజుల గడువు ఉంది. ఇంతలోనే డీఎస్సీ ని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. 2500 పోస్టులతో ఫిబ్రవరి రెండో వారంలో డీఎస్సీ ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం. గత ఏడాది దాదాపు 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటన ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
ఖాళీలను గుర్తిస్తూ..
విద్యారంగంలో ఉన్న 117 జీవోను రద్దు చేసి పాఠశాలల సర్దుబాటు ప్రక్రియను కొలిక్కి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తొమ్మిది రకాల పాఠశాలలను విభజిస్తూ.. 9,200 మోడల్ స్కూళ్ల ను( model schools) ఏర్పాటు చేశారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని నిర్ణయించారు. ఆపై రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది కాలంగా చాలామంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేశారు. వారి స్థానంలో ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉంది. ఇలా 2500 ఉపాధ్యాయ పోస్టులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ ఆర్థిక శాఖకు నివేదికలు పంపినట్లు కూడా సమాచారం. జనవరి ముగుస్తున్న దృష్ట్యా జాబ్ కాలెండర్ ప్రకటన చేయాలని భావిస్తున్నారు. అంతకుముందే డీఎస్సీ ప్రకటన ఇవ్వాలని కూడా చూస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్షను పూర్తి చేశారు.
ఈ మూడేళ్ల ప్రణాళిక ఇదే..
తెలుగుదేశం( Telugu Desam) ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను భర్తీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈసారి భారీ ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి.. పాఠశాలల్లో ఖాళీ లేకుండా చూడాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ ఏడాది 2500 పోస్టులను భర్తీ చేస్తారు. వచ్చే ఏడాది కూడా అంతే సంఖ్యలో పోస్టులతో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనున్నారు. కానీ 2029 ఎన్నికలకు ముందు మాత్రం మెగా డీఎస్సీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. తద్వారా 2029 ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లు పొందాలన్నది ప్రణాళికగా ఉన్నట్లు సమాచారం. అయితే 2500 పోస్టులతో డీఎస్సీ ప్రకటన రానుండడంపై నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
